Beach Incident: మంగినపూడి బీచ్‌లో గల్లంతైన బాలుడు మృతి
ఆదివారం మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో గల్లంతైన గూడూరు జడ్పీ హైస్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న నవీన్ మృతి చెందాడు.
- By Hashtag U Published Date - 11:46 AM, Mon - 7 November 22

ఆదివారం మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో గల్లంతైన గూడూరు జడ్పీ హైస్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న నవీన్ మృతి చెందాడు. బాలుడి మృతదేహాన్ని బందరు మండలం పెద్దపట్నం శివారు సముద్ర తీరాన పోలీసులు గుర్తించారు. సోమవారం తెల్లవారుజామున సత్రవపాలెం బీచ్ ఒడ్డుకు బాలుడి మృతదేహం కొట్టుకొచ్చింది. బాలుడి మృతదేహాన్ని అతడి మేనమామ తన బైక్‌పై తీసుకెళుతుండటం చూసి చూపరులంతా కంటతడిపెట్టారు.
మచిలీపట్నం బలరామునిపేటకు చెందిన నవీన్ (14) ఆదివారం తన స్నేహితులతో కలిసి బీచ్ కి వెళ్లాడు. సముద్రంలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు అలల ధాటికి కొట్టుకుపోయాడు. సోమవారం తెల్లవారుజామున సముద్రపు ఒడ్డున విగతజీవిగా కనిపించాడు. నవీన్ మరణ వార్త విని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు తల్లడిల్లిపోయారు. నవీన్ అదృశ్యంపై బందరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బాలుడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు.