BJP MLA Raja Singh : యూట్యూబ్ ఛానెల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ ఎమ్మెల్యే
- Author : Prasad
Date : 30-06-2022 - 3:28 IST
Published By : Hashtagu Telugu Desk
ఒక యూట్యూబ్ ఛానెల్ తనపై, తన కుటుంబంపై తప్పుడు వార్తలను ప్రచారం చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. పరువు నష్టం కలిగించే ప్రయత్నం ఆ యూట్యూబ్ చానెల్ చేస్తోందని ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘సచ్ న్యూస్’ అనే యూట్యూబ్ ఛానల్ ఒక వీడియోను ప్రచురించిందని, అందులో ఇటీవలి జూదం కేసులో నిందితుల్లో ఒకరు తన కుమారుడు ఉన్నారని వార్తలు రాశారని రాజాసింగ్ తెలిపారు. ”అరెస్టయిన వారిలో తన కొడుకు లేడని.. వార్తల వివరాలను ధృవీకరించకుండా, ఉద్దేశపూర్వకంగా ఛానెల్ తన పేరును తీసుకొని తన ఫోటోను ఉపయోగించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజలు తనకు ఫోన్ చేసి వార్తలు నిజమో కాదో వెరిఫై చేస్తున్నారని, ప్రజల్లో తన పేరు, మంచి ప్రతిష్ట దెబ్బతింటుందని అన్నారు. 48 గంటల్లో వీడియోను తీసివేసి, ఛానల్ తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేదంటే పరువు నష్టం కేసు వేస్తానని సింగ్ డిమాండ్ చేశారు.