Kishan Reddy: 350కి పైగా లోక్‌సభ స్థానాల్లో బీజేపీ విజయం సాధించబోతుంది: కిషన్ రెడ్డి
- Author : Balu J
Date : 21-01-2024 - 1:42 IST
Published By : Hashtagu Telugu Desk
Kishan Reddy: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమంక్షలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ఇక తెలంగాణలో ఎక్కువ లోక్‌సభ స్థానాలను బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని విమర్శించారు. అందుకే రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్‌ను తిరస్కరించారని చెప్పారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త సమయం ఇద్దామని అన్నారు. అయితే.. రేవంత్‌రెడ్డి సర్కార్ మాత్రం ప్రస్తుతం నిర్దేశిత లక్ష్యంతో ముందుకు వెళ్లడం లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
జనవరి 22న అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగబోతుందనీ.. ఇది భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధే బీజేపీకి శ్రీరామ రక్ష అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలకు సమయం ఎక్కువగా లేదు. దాంతో.. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటి వరకు అయితే లోక్‌సభ ఎన్నికలపై అధికారిక ప్రకటన లేకపోయినా.. ఏప్రిల్‌లో ఉండే అవకాశాలు ఉన్నాయని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.
ఏప్రిల్ మొదటి వారంలోనే ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అయితే.. ముచ్చటగా మూడోసారి దేశంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని దీమా వ్యక్తం చేశారు. ఈసారి 350కి పైగా లోక్‌సభ స్థానాల్లో బీజేపీ విజయం సాధించబోతుంది కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దీమా వ్యక్తం చేశారు.