MLA Seethakka: ఎమ్మెల్యే సీతక్కకు చేదు అనుభవం, సచివాలయంలోకి నో ఎంట్రీ
తెలంగాణ సచివాలయం ప్రారంభమై నెలలు గడుస్తున్నా.. ఎమ్మెల్యేలకు అనుమతి ఇవ్వకపోవడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
- By Balu J Published Date - 12:11 PM, Sat - 7 October 23

MLA Seethakka: తెలంగాణ సచివాలయం ప్రారంభమై నెలలు గడుస్తున్నా.. ఎమ్మెల్యేలకు అనుమతి ఇవ్వకపోవడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు చేదు అనుభవం ఎదురైంది. సచివాలయంలోకి అనుమతి లేదని చెప్పడంతో ఆమె కారు దిగి నడుచుకుంటూ లోనికి వెళ్లారు. ఈ క్రమంలో కేసీఆర్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గ పనుల కోసం నేను సచివాలయానికి వెళ్తుంటే అనుమతి లేదని ప్రవేశ ద్వారం వద్ద పోలీసులు అడ్డుకున్నట్టు తెలిపారు.
వివిధ శాఖలకు సంబంధించిన పనులపై తాను సచివాలయానికి వచ్చానని, లోపలికి వెళ్తుంటే పోలీసులు తనను అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయ నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం ఎంతో గొప్పగా చూపిస్తోందని, కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లోనికి ఎందుకు అనుమతించడంలేదని ప్రశ్నించారు. ఇది చాలా అవమానమని, దీనిపై తాను ఏదైనా చేయవచ్చు కానీ.. అలా చేయడం తనకు ఇష్టం లేదన్నారు.
నేను ప్రజా సమస్యలపై ఇక్కడకు వచ్చానన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల మధ్యకు వచ్చేది ఉండదని, పైగా వచ్చే వాళ్లను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తమ గొంతు నొక్కుతున్నారన్నారని ఆరోపించారు. గతంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే.