Balineni: జగన్ బుజ్జగింపుతో ‘బాలినేని’ కూల్
వైసీపీలో నెలకొన్న అలజడి టీ కప్పులో తుఫాన్ మాదిరిగా ముగిసింది.
- Author : CS Rao
Date : 11-04-2022 - 10:11 IST
Published By : Hashtagu Telugu Desk
వైసీపీలో నెలకొన్న అలజడి టీ కప్పులో తుఫాన్ మాదిరిగా ముగిసింది. హైడ్రామాకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెరదించారు. సీఎం జగన్ ఏ బాధ్యత అప్పగించినా చేపట్టేందుకు సిద్ధమని ప్రకటించారు. మంత్రి పదవి కోసం పాకులాడే వ్యక్తిని కానని అన్నారు. YS కుటుంబానికి విధేయుడిగానే ఉంటానని స్పష్టం చేశారు. పదవి పోయినప్పుడు కొంత బాధ ఉండటం సహజమని అన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని జరిగిన ప్రచారమంతా అవాస్తవమని బాలినేని వివరించారు.
మద్దతుగా రాజీనామాలు చేసిన అందరూ నాయకులు వాటిని వెనక్కి తీసుకుంటారనని బాలినేని తెలిపారు.
బాలినేని ఇంటి వద్ద హైడ్రామా నడిచింది. పదవి రాలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పలుమార్లు కలిసి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం రాలేదు. దీంతో సీఎం తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడారు. మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదనే విషయంపై జగన్ వివరించినట్టు తెలుస్తోంది. చివరి నిమిషంలో సమీకరణాల నేపథ్యంలో కొంతమంది సీనియర్లకు మరోసారి అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినట్లు జగన్ చెప్పినట్లు సమాచారం. మంత్రి పదవి రాలేదని బాధపడాల్సిన అవసరం లేదని పార్టీ మరోసారి అధికారంలోకి రాగానే మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజకీయాల నుంచి దూరంగా వెళ్లాలనే ఆలోచనలు మానేసి అందరినీ కలుపుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిందిగా జగన్ బుజ్జగించినట్లు తెలుస్తోంది.