Lokesh Padayatra: లోకేష్ పాదయాత్రపై బాలయ్య కామెంట్!.. వైసీపీలో భయం పుడుతోందట!
ఏపీలో రాజకీయ వేడి మొదలైంది. ఇప్పటికే ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహితో పర్యటనలు మొదలుపెట్టగా..
- By Anshu Published Date - 09:52 PM, Thu - 26 January 23

Lokesh Padayatra: ఏపీలో రాజకీయ వేడి మొదలైంది. ఇప్పటికే ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహితో పర్యటనలు మొదలుపెట్టగా.. రేపటి నుండి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేయనున్నారు. అయితే ఈ పాదయాత్రపై అధికార వైసీపీ నేతలు ఎలా కామెంట్ చేసినా.. తెలుగుదేశం నేత, నారా లోకేష్ మామ నందమూరి బాలయ్య మాత్రం ఆసక్తికర కామెంట్ చేశారు.
నారా లోకేష్ పాదయాత్ర వైసీపీలో భయం పుట్టిస్తోందని హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలయ్య అన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత నారా లోకేష్ చేయబోయే పాదయాత్ర ‘యువగళం’తో బయటపడుతుందని వైసీపీ భయపడుతోందని.. అందుకే వైసీపీ నేతలు భయంతో మాట్లాడుతున్నారని అన్నారు. వైసీపీ నేతల బెదిరింపులకు ఇక్కడ భయపడే వాళ్లు ఎవరూ లేరని బాలయ్య అన్నారు.
సత్యసాయి జిల్లా హిందుపురంలో నిర్వహించిన ‘ఇదే ఖర్మ రాష్ట్రానికి’కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. వైసీపీకి ఇసుక, మైన్లు తప్ప ప్రజలు, వాళ్ల ఇబ్బందులు పట్టడం లేదని అన్నారు. లోకేష్ చేయనున్న యువగళం పాదయాత్రం వైసీపీ నేతల్లో భయం కలిగిస్తోందన్న బాలయ్య.. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని అన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత ఆందోళన చెందుతున్నట్లు వివరించారు.
ఏపీలో ప్రభుత్వం ఉన్నా లేనట్లే వ్యవహరిస్తోందని, చాలామంది ఏపీలో ఉపాధి, ఉద్యోగాలు లేకపోవడంతో వలసలు వెళుతున్నట్లు నందమూరి బాలయ్య వ్యాఖ్యానించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ తిరిగి విజయపథంలో నడుస్తుందని నందమూరి బాలయ్య ఆశాభావం వ్యక్తం చేశారు.