Iran Blasts: ఇరాన్ లో భారీ పేలుళ్లు.. 100 మందికి పైగా మృతి
ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఈ దాడులు జరగడం పలు అనుమానాలకు దారితీస్తోంది. కాగా.. గాజాపై దాడులను
- By News Desk Published Date - 11:04 PM, Wed - 3 January 24

Iran Blasts: ఇరాన్ సైనిక ఉన్నతాధికారి అయిన ఖాసీం సులేమానీ సంస్మరణ కార్యక్రమంలో పెనువిషాదం చోటుచేసుకుంది. కెర్మాన్లోని ఆయన సమాధి సమీపంలో జంట పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 100 మందికి పైగా మృతి చెందగా.. మరో 140 మందికి పైగా గాయపడినట్లు అధికారిక మీడియా తెలిపింది. ఈ పేలుళ్లు ఉగ్రవాద దాడులేనని ఒక ఉన్నతాధికారి పేర్కొన్నారు. అయితే దీని వెనుక ఎవరి హస్తం ఉందో తెలియాల్సి ఉందన్నారు.
ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఈ దాడులు జరగడం పలు అనుమానాలకు దారితీస్తోంది. కాగా.. గాజాపై దాడులను ఇరాన్ ముందు నుంచీ వ్యతిరేకిస్తూ వస్తోంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ లోని అత్యంత శక్తిమంతమైన ఖుద్స్ ఫోర్స్ కు నేతృత్వం వహించిన ఖాసీం సులేమానీ.. 2020 జనవరి 3న అమెరికా డ్రోన్ దాడిలో మరణించారు. ఇరాక్ రాజధాని అయిన బాగ్దాద్ లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ దాడికి అప్పటి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలిచ్చారు. ఆ తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులు కూడా చేసింది. 2020లో ఆయన అంత్యక్రియల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 56 మంది ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా సులేమానీ 4వ వర్థంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రంలో పేలుళ్లు జరగడం తీవ్రకలకలం రేపింది.