Director Tatineni Rama Rao: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ సినీ దర్శకుడు తాతినేని రామారావు కన్నుమూత
టాలీవుడ్ ను వరుస విషాదాలు కుదిపేస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు, ఎన్టీఆర్ నటించిన యమగోల సినిమాను డైరెక్ట్ చేసిన తాతినేని రామారావు కన్నుమూశారు.
- By Hashtag U Published Date - 08:34 AM, Wed - 20 April 22

టాలీవుడ్ ను వరుస విషాదాలు కుదిపేస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు, ఎన్టీఆర్ నటించిన యమగోల సినిమాను డైరెక్ట్ చేసిన తాతినేని రామారావు కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికిల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయినా ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. పరిస్థితి విషమంగా మారడంతో.. ఆయన కోలుకోవడానికి వైద్యులు విశ్వప్రయత్నాలు చేశారు. అయినా అవేవీ ఫలించలేదు. దీంతో ఆయన కన్నుమూశారు.
84 ఏళ్ల తాతినేని రామారావు సాధించిన విజయాలు చాలా ఎక్కువ. ఆయన తన కెరీర్ లో దాదాపు 70 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇందులో తెలుగు, హిందీ చిత్రాలు ఉన్నాయి. ఆయన వెండితెరకు దర్శకుడిగా పరిచయమైన తొలి సినిమా 1966లో వచ్చిన నవరాత్రి. ఆ తరువాత పలువురు అగ్ర కథానాయకులతో హిట్ సినిమాలు అందించారు. వీటిలో ఎన్టీఆర్ నటించిన యమగోలతోపాటు జీవనతరంగాలు, ఆలుమగలు, న్యాయనికి సంకెళ్లు, దొరబాబు, అనురాగదేవత వంటి ఎన్నో హిట్ చిత్రాలు ఉన్నాయి. రాజేంద్రప్రసాద్‌తో గోల్ మాల్ గోవిందం, సూపర్ స్టార్ కృష్ణతో అగ్ని కెరటాలు అనే సినిమాలు కూడా రామారావు డైరెక్షన్ లో వచ్చినవే.
1938లో కృష్ణా జిల్లా కపిలేశ్వరపురంలో జన్మించిన రామారావుకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే బాగా మక్కువ. అందుకే ఎప్పటికైనా దర్శకుడు కావాలని కలలు కన్నారు. అయితే మెగాఫోన్ పట్టుకోవాలంటే ముందు డైరెక్షన్ గురించి పూర్తిగా తెలిసుండాలని సినీ పెద్దలు చెప్పడంతో.. ఆయన తనకు వరుసకు సోదరుడు అయిన తాతినేని ప్రకాశరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. అలాగే కోటయ్య ప్రత్యగాత్మ దగ్గరా అసిస్టెండ్ డైరెక్టర్ గా పనిచేయడంతో దర్శకత్వంలో మెళకువలు ఆయనకు బాగా తెలిశాయి. రామారావు మతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.