Amritsar Blast: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో బాంబు పేలుళ్లు
అమృత్‌సర్ లోని శ్రీ హరిమందిర్ సాహిబ్ సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్ ప్రాంతంలో సోమవారం ఉదయం 6:30 గంటలకు పేలుడు సంభవించింది
- By Praveen Aluthuru Published Date - 10:44 AM, Mon - 8 May 23

Amritsar Blast: అమృత్‌సర్ లోని శ్రీ హరిమందిర్ సాహిబ్ సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్ ప్రాంతంలో సోమవారం ఉదయం 6:30 గంటలకు పేలుడు సంభవించింది. ఘటన జరిగిన సమయంలో రోడ్డుపై పెద్దగా ట్రాఫిక్ లేదు. పలువురు సీనియర్ పోలీసు అధికారులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. ఫోరెన్సిక్ బృందం సభ్యులు పలు నమూనాలను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు జరిగిన చోట ఒక కారు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.. డిసిపి పర్మిందర్ సింగ్ భండాల్ హెరిటేజ్ స్ట్రీట్‌లోని సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
శనివారం అర్థరాత్రి గోల్డెన్ టెంపుల్ సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్‌లో కూడా పేలుడు సంభవించింది. ఒక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయని, కొన్ని భవనాల కిటికీలు దెబ్బతిన్నాయని సమాచారం. అయితే ఇది ఉగ్రదాడి కాదని, ప్రమాదం అని పోలీసులు తెలిపారు.శనివారం రాత్రి పేలుడు సంభవించిన తర్వాత దర్బార్ సాహిబ్ సమీపంలో రద్దీగా ఉండే హెరిటేజ్ స్ట్రీట్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. ఘటనా స్థలంలో ఉన్న పలువురు భక్తులు, స్థానికులు ఈ పేలుడును ఉగ్రవాద ఘటనగా భావిస్తున్నారు.
పరిస్థితి అదుపులో ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మెహతాబ్ సింగ్ తెలిపారు. ఫోరెన్సిక్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. సమీపంలోని భవనాల కిటికీ అద్దాలు మాత్రమే పగిలిపోవడంతో భవనాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు.
Read More: King Charles III : కింగ్ చార్లెస్ తర్వాత బ్రిటన్ రాజు ఎవరు ? పోటీదారులు ఎవరెవరు ?