Al-Jazeera reporter killed: ఇజ్రాయెల్ సైన్యం దాడి.. అల్ జజీరా మహిళా జర్నలిస్ట్ మృతి !!
పాలస్తీనాపై ఇజ్రాయెల్ సైన్యం బలప్రయోగం ఆగడం లేదు.
- By Hashtag U Published Date - 01:35 PM, Wed - 11 May 22

పాలస్తీనాపై ఇజ్రాయెల్ సైన్యం బలప్రయోగం ఆగడం లేదు. తాజాగా ఇజ్రాయెల్ దళాలు పాలస్తీనా సరిహద్దు ప్రాంతాలపై జరిపిన దాడిలో అల్ జజీరా జర్నలిస్ట్ 51 ఏళ్ల షిరీన్ అబు అక్లేహ్ (Shireen Abu Akleh) మృతిచెందారు. ఇంకొందరు జర్నలిస్టులకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ పరిధిలోని జెనిన్ ప్రాంతంలో ఉన్న పాలస్తీనా క్యాంపుపై ఇజ్రాయెల్ దళాలు అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డాయి.
ఈ ఘటన దృశ్యాలను కెమెరాలో చిత్రీకరిస్తున్న షిరీన్ అబు అక్లేహ్ పైనా ఇజ్రాయెల్ సైనికులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆమె ముఖానికి బుల్లెట్లు తగిలి, అక్కడికక్కడే కుప్పకూలింది. పరిస్థితి విషమంగా ఉండంటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ చనిపోయినట్లు పాలస్తీనా తెలిపింది. ఈమేరకు ఆల్ జజీరా వార్తా సంస్ధ ఒక కథనాన్ని ప్రచురించింది. మరో జర్నలిస్ట్ అలీ ఆల్ సమౌది కి తీవ్ర గాయాలైనప్పటికీ .. ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. షిరీన్ ‘ప్రెస్” అనే పదాలతో సూచికను ధరించి ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరపడం పత్రికా స్వేచ్ఛను కాలరాయడమే అవుతుందని ఆల్ జజీరా మీడియా వ్యాఖ్యానించింది. జర్నలిస్ట్ షిరీన్ హత్యకు ఇజ్రాయెల్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని పాలస్తీనా అథారిటీ డిమాండ్ చేసింది. పాలస్తీనాకు చెందిన అబు అక్లేహ్ దాదాపు 22 ఏళ్ల నుంచి అల్ జజీరాలో పనిచేస్తున్నట్లు సంస్థ తెలిపింది. కాగా.. ఈ ఘటనపై ఇజ్రాయెల్ సైన్యం నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. షిరీన్ అబు అక్లేహ్ మృతిపై పలు మీడియా సంస్థలు విచారం వ్యక్తంచేస్తూ.. ఇజ్రాయిల్ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.