AAP Telangana : తెలంగాణలో పాదయాత్రకు సిద్ధమవుతున్న ఆమ్ ఆద్మీపార్టీ
ఇటీవల జరిగిన పంజాబ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఆమ్ ఆద్మీపార్టీ ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారించింది.
- By Hashtag U Published Date - 04:17 PM, Mon - 28 March 22

ఇటీవల జరిగిన పంజాబ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఆమ్ ఆద్మీపార్టీ ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారించింది. వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణలో ఎన్నికలకు ముందు ‘పాదయాత్ర’ నిర్వహిస్తామని ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణలో పర్యటించి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించే అవకాశం ఉంది. ఇటీవల ఆప్ తెలంగాణ ఇన్‌ఛార్జ్ సోమనాథ్ భారతి హైదరాబాద్, వరంగల్‌లో పర్యటించారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి రంగం సిద్ధం చేస్తున్న పార్టీ నేతలు, విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు. దక్షిణాది రాష్ట్రాల ఇన్‌చార్జి సోమనాథ్ భారతి మాట్లాడుతూ.. సామాన్యుల సమస్యలను లెవనెత్తి ఆప్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని.. బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందన్నారు. కాగా, అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్ర పర్యటనపై టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్‌ను స్వాగతిస్తూ.. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందులో తప్పు లేదన్నారు.