Rajouri encounter: జమ్మూలో ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు మృతి
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా కంది ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు సైనికులు మరణించారు.
- By Praveen Aluthuru Published Date - 05:21 PM, Fri - 5 May 23

Rajouri encounter: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా కంది ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు సైనికులు మరణించారు. దీంతో జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్, ఏడీజీపీ జమ్మూ ముఖేష్ సింగ్ రాజౌరీలోని కంది ప్రాంతానికి చేరుకున్నారు.
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో శుక్రవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. సెర్చ్ ఆపరేషన్ సమయంలో, ఉగ్రవాదులు ప్రతీకారంగా పేలుడు పదార్థాలతో తెగబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందగా, నలుగురు జవాన్లు గాయపడ్డారు. గాయపడిన నలుగురు జవాన్లను చికిత్స నిమిత్తం ఉదంపూర్‌లోని కమాండ్ ఆసుపత్రిలో చేర్చారు. వీరిలో ముగ్గురు జవాన్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఉగ్రవాదుల సమాచారం అందుకున్న భద్రతాబలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉదయం ప్రారంభమైన ఈ ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోంది.ఏప్రిల్ 20న జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు ఆర్మీ జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. ఆ దాడి తరువాత జవాన్లు ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టారు. జమ్మూ కాశ్మీర్‌లో నిరంతరం సోదాలు కొనసాగుతున్నాయి. దీంతో పాటు బుధవారం నుంచి లోయలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదులను మట్టుబెట్టే ప్రక్రియ కొనసాగుతోంది.