Youtube 20 Years: 20వ వసంతంలోకి ‘యూట్యూబ్’.. ఎలా ఏర్పాటైందో తెలుసా ?
యూట్యూబ్‌ను(Youtube 20 Years) తొలుత ఒక డేటింగ్ యాప్‌గా ప్రారంభించారు.
- By Pasha Published Date - 09:36 AM, Sun - 2 March 25

Youtube 20 Years: జనం నిత్యం చూసే సోషల్ మీడియా వేదిక ఏదైనా ఉందంటే.. కచ్చితంగా అది యూట్యూబే. స్టీవ్‌చెన్, చాద్‌హాలీ, జావేద్‌కరీమ్ అనే ముగ్గురు స్నేహితులు కలిసి దీన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడిది ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో ప్లాట్‌ఫామ్. 2005 సంవత్సరం ఫిబ్రవరి 14న యూట్యూబ్ ఏర్పాటైంది. దీని విశేషాలివీ..
ఎలా ఏర్పాటైంది ?
యూట్యూబ్‌ను(Youtube 20 Years) తొలుత ఒక డేటింగ్ యాప్‌గా ప్రారంభించారు. స్టీవ్‌చెన్, చాద్‌హాలీ, జావేద్‌కరీమ్‌లు ఒక రోజు పార్టీ చేసుకుందామని అనుకున్నారు. అయితే ఆ పార్టీకి జావేద్ రాలేకపోయాడు. దీంతో తాము చేసుకునే పార్టీ గురించి జావేద్‌కు నోటితో చెప్పేకన్నా, వీడియోను చూపిస్తే బాగుంటుందని స్టీవ్‌చెన్, చాద్‌హాలీ భావించారు. కానీ ఆన్‌లైన్‌లో సరైన వీడియో ప్లాట్‌ఫామ్ ఏదీ వారికి కనిపించలేదు. ఈ సమయంలో వాళ్లకు వచ్చిన ఐడియానే యూట్యూబ్. వెంటనే స్టీవ్‌చెన్, చాద్‌హాలీ, జావేద్‌కరీమ్‌లు కలిసి యూట్యూబ్ పేరుతో ఒక ఆన్‌లైన్ వేదికను ఏర్పాటు చేశారు. వీడియోల ద్వారా అమ్మాయిలు, అబ్బాయిలు ఇందులో కలుసుకోవచ్చని ప్రకటించారు. అయితే దీనికి అంతగా ఆదరణ రాలేదు. దీంతో జావేద్ కరీమ్ ‘మీ ఎట్ ది జూ’ పేరుతో ఓ జూలో తీసిన వీడియోను తొలుత యూట్యూబ్‌లో షేర్ చేశాడు. దీన్ని ఇప్పటి వరకు 35 కోట్లమంది చూశారు. ఆ తర్వాత యూట్యూబ్ ఎంతగా ఎదిగిందో మనకు తెలుసు.
Also Read :CMO Vs PCCF: సీఎంఓ వర్సెస్ పీసీసీఎఫ్.. ఐఎఫ్ఎస్ అధికారుల టూర్‌పై వివాదం
యూట్యూబ్ పేరుతో మరో సంస్థ
యూట్యూబ్‌ను ప్రారంభించే నాటికే, అదే పేరుతో మరో సంస్థ కూడా ఉండేది. ఈ యూట్యూబ్ కోసం వెతికే నెటిజన్ల వల్ల, ఆ సంస్థ సైట్‌కు కూడా ట్రాఫిక్ పెరిగేది. దాంతో ఆ సంస్థకు కోపమొచ్చి కోర్టుకు ఎక్కింది. చివరకు ఆ సంస్థే రాజీపడి తన పేరును మార్చుకుంది. యూట్యూబ్‌ను ప్రారంభించిన ఏడాదికే ఆ సంస్థను గూగుల్ ఇప్పటి లెక్కల ప్రకారం దాదాపు రూ.13వేల కోట్లకు కొనేసింది. క్యాలిఫోర్నియాలోని సాన్‌బ్రూనోని ప్రధాన కేంద్రంగా చేసుకుని 130 దేశాల్లో 80 భాషల్లోకి విస్తరించింది.
Also Read :Meenakshi Natarajan : మీనాక్షి మార్క్.. టీపీసీసీ కార్యవర్గం ఎంపికలో మారిన లెక్క
యూట్యూబ్ విశేషాలివీ..
- ప్రపంచంలో అత్యధికంగా యూట్యూబ్‌ను ఉపయోగించేది భారతీయులే. ఆ తర్వాత స్థానంలో అమెరికా, బ్రెజిల్ ఉన్నాయి.
- యూట్యూబ్‌లోని వీడియోలన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూడాలంటే దాదాపు 18వేల సంవత్సరాలు పడుతుంది.
- యాడ్స్ ద్వారా యూట్యూబ్‌కి 2024 సంవత్సరంలో వచ్చిన ఆదాయం దాదాపు రూ.3 లక్షల కోట్లు.
- 2014 నుంచి 2023 వరకు యూట్యూబ్ సీఈఓగా వ్యవహరించిన సూసాన్ వల్లే ఇదంతా సాధ్యమైంది. ప్రస్తుతం యూట్యూబ్ సీఈఓగా భారత్‌కు చెందిన నీల్‌మోహన్ ఉన్నారు.
- యూట్యూబ్‌ను ఎక్కువగా చూసేది పురుషులేనట. 54.3 శాతం మంది పురుషులు, 46 శాతం మంది మహిళలు యూట్యూబ్ చూస్తున్నారు.
- అత్యధికులు చూసిన యూట్యూబ్ వీడియో ‘బేబీ షార్క్ డూడూ.. డూడూ’. పిల్లలు పాడుకునే ఓ రైమ్‌కి సంబంధించిన ఈ వీడియోకు 1500 కోట్ల వ్యూస్ వచ్చాయి.