Telangana Turmeric Board : ‘పసుపు బోర్డు’ ఏర్పాటయ్యేది తెలంగాణలోనేనా ? గెజిట్ నోటిఫికేషన్ లో నో క్లారిటీ
Telangana Turmeric Board : తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అక్టోబరు 1న పాలమూరులో జరిగిన బీజేపీ జనగర్జన సభలో ప్రకటించారు.
- By Pasha Published Date - 12:17 PM, Fri - 6 October 23

Telangana Turmeric Board : తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అక్టోబరు 1న పాలమూరులో జరిగిన బీజేపీ జనగర్జన సభలో ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ అక్టోబర్ 4న ఆమోదం కూడా తెలిపింది. ఇక్కడి వరకు ఓకే.. కానీ పసుపు బోర్డుపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ లో తెలంగాణ ప్రస్తావన కానరాలేదు. దీంతో తెలంగాణ కోసం ప్రకటించిన పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది ? దానికి ప్రాంతీయ కార్యాలయాలు ఉంటాయా ? అనే దానిపై డైలమా నెలకొంది.
హైదరాబాద్‌లో నైపర్ ఉన్నప్పటికీ..
హైదరాబాద్‌లో జాతీయ ఔషధ విద్య, పరిశోధన మండలి (నైపర్) శాఖ ఉన్నప్పటికీ.. దానికి బదులు గువాహటిలోని నైపర్ డైరెక్టర్‌ను పసుపు బోర్డులో సభ్యుడిగా నియమించారు. దేశంలో సాగయ్యే పసుపులో దాదాపు 70 శాతం నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాల నుంచే ఉత్పత్తి అవుతోంది. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ 2019 ఎన్నికల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామనే హామీతోనే గెలుపొందారు. ప్రధాని ప్రకటనతో నిజామాబాద్‌లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తారని అంతా భావించారు. కానీ కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో తెలంగాణ పేరు కనిపించడం లేదు. దాంతో బోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది ప్రస్తుతం చర్చనీయాశంమైంది.
Also read : Amararaja : స్కాలర్ షిప్ తో ఉచిత శిక్షణ.. అమరరాజా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ లో గొప్ప అవకాశం
మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో అత్యధికంగా పసుపు ఉత్పత్తి అవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించినందున ఈ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు ప్రతినిధులు, రైతులను కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డులో నియమించనుంది. ఇందులో ఛైర్ పర్సన్, కార్యదర్శి, వాణిజ్యం, వ్యవసాయం-రైతుసంక్షేమం, ఆయుష్, ఔషధ మంత్రిత్వశాఖలు- విభాగాలకు సంబంధించిన నలుగురు సభ్యులు, పసుపు ఉత్పత్తి చేసే రాష్ట్రాల నుంచి ముగ్గురు ప్రతినిధులు (రొటేషన్ పద్ధతిలో), పసుపు రైతులు ముగ్గురు, పసుపు ఆధారిత ఉత్పత్తుల ఎగుమతిదారుల నుంచి ఇద్దరు సభ్యులు, సుగంధద్రవ్యాల బోర్డు కార్యదర్శి, కోజికోడ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పైస్ రీసెర్చ్ డైరెక్టర్, గువాహటిలోని నైపర్ డైరెక్టర్, జాతీయ ఔషధమొక్కల బోర్డు సీఈవో ఉంటారు. ఛైర్‌పర్సన్, సభ్యుల పదవీకాలం (Telangana Turmeric Board) మూడేళ్లు.
We’re now on WhatsApp. Click to Join