Smart Phone Vs Congo War : ఆ దేశంలో యుద్ధానికి.. మన స్మార్ట్‌ఫోన్‌కు లింకు.. ఎలా ?
ఇంతకీ కాంగో అంతర్యుద్ధంతో(Smart Phone Vs Congo War) స్మార్ట్ ఫోనుకు ఉన్న సంబంధం ఏమిటి.. అని ఆలోచిస్తున్నారా ?
- By Pasha Published Date - 12:39 PM, Sun - 2 February 25

Smart Phone Vs Congo War : అంతర్యుద్ధంతో ఆఫ్రికా దేశం కాంగో నెత్తురోడుతోంది. తాజాగా కాంగో సైన్యం , రువాండా మద్దతు కలిగిన రెబల్స్ మధ్య జరిగిన ఘర్షణల్లో దాదాపు 700 మందికిపైగా చనిపోయారు. 2,880 మందికిపైగా గాయపడ్డారు. కాంగోలో అంతర్యుద్ధానికి రాజకీయ కారణాలు ఎన్నైతే ఉన్నాయో.. వ్యాపార, ఆర్థిక కారణాలు కూడా అన్నే ఉన్నాయి. మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్‌తోనూ కాంగో అంతర్యుద్ధానికి లింకు ఉంది. అదెలాగో తెలియాలంటే ఈ కథనాన్ని తప్పకుండా చదవాల్సిందే.
Also Read :Tariffs War : మూడు దేశాలపై ట్రంప్ ‘ట్యాక్స్’ వార్.. కెనడా, మెక్సికో, చైనా సంచలన నిర్ణయాలు
ఏమిటీ ‘టాంటాలమ్’ ?
ఇంతకీ కాంగో అంతర్యుద్ధంతో(Smart Phone Vs Congo War) స్మార్ట్ ఫోనుకు ఉన్న సంబంధం ఏమిటి.. అని ఆలోచిస్తున్నారా ? ఆ వివరాల్లోకి వెళ్లే ముందు మనం ‘టాంటాలమ్’ అనే లోహం గురించి తెలుసుకుందాం.. ప్రతీ స్మార్ట్‌ఫోన్‌లో కొద్ది పరిమాణంలో ‘టాంటాలమ్’ లోహం ఉంటుంది. బటానీ గింజ బరువులో సగంకన్నా తక్కువ బరువు ఉండే ‘టాంటాలమ్’ లోహం మన ఫోన్‌లో ఉంటుంది. స్మార్ట్ ఫోన్ బాగా పని చేయాలంటే దీన్ని వినియోగించడం తప్పనిసరి. దాదాపు అన్ని ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలోనూ ఈ లోహాన్ని వినియోగిస్తుంటారు. ‘టాంటాలమ్’ అనేది అరుదైన లోహం. ఇది బ్లూ-గ్రే రంగులో ఉంటుంది. మెరుస్తుంటుంది. ఈ లోహం అధిక ఉష్ణోగ్రతలను కూడా తట్టుకోగలదు. తాత్కాలికంగా ఎనర్జీని నిల్వ చేసే చిన్న కెపాసిటర్లను అనేక రకాల ఉష్ణోగ్రతల్లో ఆపరేట్ చేసేటప్పుడు ఈ లోహం ఉపయోగపడుతుంది. మన స్మార్ట్‌ఫోన్ లోపల చాలా కెపాసిటర్లు ఉంటాయి. వాటి నిర్వహణ కోసం ‘టాంటాలమ్’ లోహాన్ని వినియోగిస్తారు.
‘టాంటాలమ్’ వల్లే కాంగోలో రక్తపు కార్చిచ్చు
‘టాంటాలమ్’ లోహం అనేది కాంగో, రువాండా, బ్రెజిల్, నైజీరియా దేశాల్లోని భూముల్లో లభిస్తుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సప్లై అవుతున్న టాంటాలమ్‌లో దాదాపు 40శాతం ఒక్క కాంగో దేశం నుంచే అందుతోంది. అంటే అక్కడ ఎంత పెద్ద మొత్తంలో ‘టాంటాలమ్’ నిల్వలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈవిషయమే కాంగోలో అంతర్యుద్ధం అనే కార్చిచ్చును రేపుతోంది. నిత్యం ఎంతోమంది అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటోంది. ‘టాంటాలమ్’ నిల్వలు కాంగో తూర్పు ప్రాంతంలోని భూమి పొరల్లో దొరుకుతుంటుంది. తొలుత భూమి నుంచి కోల్టాన్ అనే ముడిపదార్థాన్ని సేకరిస్తారు. దాన్ని ప్రాసెసింగ్ చేస్తే ‘టాంటాలమ్’ లోహం బయడపడుతుంది. కోల్టాన్ గనులను దక్కించుకోవడం కోసమే కాంగో తూర్పు ప్రాంతంలో ప్రస్తుతం తీవ్ర స్థాయిలో అంతర్యుద్ధం జరుగుతోంది.
Also Read :Congress MLAs Meeting : కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీలో అసలేం జరిగింది ? సీఎం రేవంత్‌కు నాయిని లేఖ
కోల్టాన్ గనులన్నీ ‘ఎం23’ ఆధీనంలోనే..
కాంగోలో ఎం23 అనే తిరుగుబాటు సంస్థ ఉంది. ‘టాంటాలమ్’ నిల్వలు భారీగా ఉన్న కాంగో తూర్పు ప్రాంతంపై ఎం23 సంస్థ పట్టు సాధిస్తోంది. పెద్దసంఖ్యలో కోల్టాన్ గనులను ఎం23 ఆధీనంలోకి తీసుకుంది. 2024 సంవత్సరం ఏప్రిల్‌లో కాంగోలో కోల్టాన్ పరిశ్రమకు ప్రధాన కేంద్రమైన రుబాయాను ఎం23 రెబల్స్ స్వాధీనం చేసుకున్నారు.ఆయా గనుల నుంచి ‘టాంటాలమ్’ నిల్వలను సేకరించి స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీలకు ఎం23 సంస్థ అనధికారిక మార్గాల ద్వారా విక్రయిస్తుంటుంది. ఈవిధంగా వందల కోట్ల ఆదాయాన్ని ఎం23 సంస్థ ఆర్జిస్తుంటుంది. ఆ ఆదాయంతోనే ఆయుధాలను కొంటారు. తమ మిలిటెంట్లకు శాలరీలను చెల్లిస్తుంటారు. కోల్టాన్ గనులపై పట్టు కోసం ఎం23 మిలిటెంట్ సంస్థకు, కాంగో సైన్యానికి, ఇతర మిలిటెంట్ సంస్థలకు మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతుంటాయి.