Ayyappa Darshan : శబరిమలలో భక్తుల రద్దీ మహిళ దుర్మరణం..!
- By Vamsi Chowdary Korata Published Date - 04:03 PM, Wed - 19 November 25
శబరిమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ తీవ్రం అవుతోంది. క్యూలైన్లు కిలోమీటర్ల మేర పెరిగిపోవడంతో.. భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే గంటల తరబడి క్యూలైన్లలో నిలుచున్న భక్తుల మధ్య తొక్కిసలాట వంటి పరిస్థితి ఏర్పడటంతో ఓ మహిళ కింద పడిపోయింది. ఆ తర్వాత ఆమె ప్రాణాలు కోల్పోయింది. అయితే భారీగా తరలివస్తున్న భక్తుల కోసం.. ఆలయ అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో మకరవిళక్కు యాత్ర సీజన్ ప్రారంభం కావడంతో.. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు.. పోటెత్తుతున్నారు. దీంతో సన్నిధానం మాత్రమే కాకుండా.. పంబ, నీలక్కల్ ప్రాంతాల్లో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో కిలోమీటర్ల పొడవునా క్యూలైన్లు పెరుగుతున్నాయి. దీంతో ఒక్కసారిగా పోటెత్తుతున్న భక్తులను కంట్రోల్ చేయడం.. ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు టీడీబీ అధికారులకు, పోలీసుల వల్ల కావడం లేదు. ఈ క్రమంలోనే క్యూ లైన్లలో కిలోమీటర్ల మేర వేచి చూసిన భక్తుల్లో ఓపిక నశించి.. ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో క్యూలైన్లను తప్పించుకుంటూ.. వాటిపై నుంచి దూకి పరుగులు తీస్తుండటంతో.. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.
ఈ క్రమంలోనే మంగళవారం దర్శనం కోసం 10 గంటలకు పైగా క్యూలో నిలబడిన భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఈ భక్తుల రద్దీతో తొక్కిసలాట వాతావరణం నెలకొంది. దీంతో కోజికోడ్ జిల్లాలోని కోయిలాండికు చెందిన 58 ఏళ్ల మహిళ కుప్పకూలిపోయింది. అనంతరం ఆమె మరణించారు. గంటల తరబడి నిరీక్షించిన భక్తులు ఆలయ సమీపంలోని నడ పందల్ వద్ద బారికేడ్లను దూకి.. పదునెట్టాంబడి 18 పవిత్ర బంగారు మెట్లు వైపు దూసుకురావడంతో ఈ తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది.ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్ మృతురాలి మృతదేహాన్ని.. టీడీబీ ఖర్చుతో అంబులెన్స్‌లో ఆమె స్వస్థలానికి తరలించనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ తొక్కిసలాట లాంటి పరిస్థితిని అదుపు చేయడానికి అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. అయినప్పటికీ ఈ గందరగోళంలో చిన్నారులు, వృద్ధులు అస్వస్థతకు గురయ్యారు. శబరిమల భద్రతా ఏర్పాట్లకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్. శ్రీజిత్.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రద్దీని నియంత్రించడానికి ఆలయ దర్శన సమయాన్ని మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటల వరకు పొడిగించారు.
వర్చువల్ క్యూ బుకింగ్ ద్వారా రోజుకు 70 వేలు, స్పాట్ బుకింగ్ ద్వారా 20 వేల మందికి మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ.. ఆ రోజున ఎక్కువ మంది భక్తులు ఆలయానికి చేరుకున్నారని టీడీబీ అధ్యక్షుడు కె.జయకుమార్ తెలిపారు. ఇకపై రోజుకు గరిష్టంగా ఒక లక్ష మంది భక్తులను మాత్రమే అనుమతించాలని.. అలాగే భక్తులను వారికి కేటాయించిన సమయ స్లాట్‌లలో మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. రద్దీని నిర్వహించడానికి.. స్పాట్ బుకింగ్ సౌకర్యాలను ఇతర విరామ ప్రదేశాలలో ఏర్పాటు చేయనున్నారు. భక్తులకు సరైన ఏర్పాట్లు.. నీరు, ఆహారం వంటి కనీస సౌకర్యాలు లేకపోవడంపై భక్తులు తీవ్ర విమర్శలు గుప్పించారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.