Vande Bharath: వందేభారత్ రైలు పరుగులు.. వారంలో ఆరు రోజుల టైమింగ్స్ ఇవే!
ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
- By Anshu Published Date - 10:07 PM, Fri - 13 January 23
 
                        Vande Bharath: ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. వందేభారత్ రైలు తెలుగు నేలపై పరుగులు పెట్టనుంది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ రైలు ఎనిమిదోది కావడం విశేషం. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య ఈ రైలు రాకపోకలు జరగనున్నాయి. ఒక ఆదివారం తప్పా వారానికి 6 రోజుల పాటు ఈ రైలు సర్వీసులు ఉంటాయని అధికారులు తెలిపారు.
జనవరి 15వ తేది ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ వందేభారత్ ట్రైన్ ను వర్చువల్ గా జెండా ఊపి ప్రారంభించే కార్యక్రమం జరగనుంది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నెంబరు 20833 ఉంది. అలాగే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకూ రైలు నెంబరు 20834 వెళ్లనుంది. విశాఖపట్నం నుంచి రైలు ఉదయం 5.45 గంటలకు బయల్దేరి మధ్యలో రాజమండ్రికి 7.55కు చేరుకుంటుంది. ఆ తర్వాత విజయవాడ 10.00, ఖమ్మం 11.00, వరంగల్ 12.05, సికింద్రాబాద్ 14.15 గంటలకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు.
మళ్లీ సికింద్రాబాద్ నుంచి 15.00 గంటలకు అంటే మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి వరంగల్ కు 16.35, ఖమ్మం 17.45, విజయవాడ 19.00, రాజమండ్రి 20.58, విశాఖపట్నం 23.30 గంటలకు చేరుకోనుంది. తిరిగి మళ్లీ ఉదయం సర్వీసు యథావిధిగా ప్రారంభం కానుంది. ఒక్క ఆదివారం తప్ప మిగతా రోజుల్లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి.
తెలుగు రాష్ట్రాల మధ్య నడవనున్న వందే భారత్ రైలు కోసం ముందే ఖరారు చేసిన షెడ్యుల్ లో మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. ఖమ్మం ప్రజల ఒత్తిడి నేపథ్యంలో కొత్తగా ఖమ్మం స్టేషన్‌లో వందేభారత్ రైలును ఆపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈ రైలుకు 18 బోగీలు ఉండగా అందులో ప్రైమరీ మెయింటెనెన్స్ విశాఖపట్నంలోనే ఉండనున్నట్లు అధికారులు తెలిపారు.