Tamil Nadu Cabinet Reshuffle : స్టాలిన్ క్యాబినెట్‌లోకి కొత్తగా చేరిన వారు వీరే..
Tamil Nadu Cabinet Reshuffle : ఉదయనిధి స్టాలిన్‌కు ప్రమోషన్‌తో పాటు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ (Senthil Balaji)ని తిరిగి క్యాబినెట్‌లోకి తీసుకున్నారు
- By Sudheer Published Date - 07:21 PM, Sun - 29 September 24

తమిళనాడు సీఎం స్టాలిన్ (Tamil Nadu CM Stalin) తన మంత్రివర్గంలో కొత్తగా మరో ముగ్గురు చేరారు. ఆదివారం వారు ప్రమాణస్వీకారం చేశారు. చెన్నైలోని రాజ్‌భవన్‌లో ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. డా. గోవి. చెజియాన్, ఆర్.రాజేంద్రన్, ఎస్ఎం నాసర్ (Govi Chezhian, SM Nasar and R Rajendran)లను కొత్తగా మంత్రివర్గంలో చేర్చుకున్నారు స్టాలిన్. అదే సమయంలో మంత్రిగా ఉన్న తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) ను ఉప ముఖ్యమంత్రి(Deputy Chief Minister)గా తీసుకోవడమే కాదు కీలక శాఖలను అప్పగించారు.
ఉదయనిధి స్టాలిన్‌కు ప్రమోషన్‌తో పాటు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ (Senthil Balaji)ని తిరిగి క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. మనీల్యాండరింగ్ కేసులో ఆరోపణలతో అరెస్టయిన బాలాజీ.. మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ కేసులో ఆయనకు రెండు రోజుల కిందటే బెయిల్ రాగా.. మళ్లీ మంత్రివర్గంలో అవకాశం కల్పించారు స్టాలిన్.
ఇక, సెంథిల్ బాలాజీకి పాత శాఖలు.. విద్యుత్, సంప్రదాయేతర ఇంధన అభివృద్ధి, ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ బాధ్యతలు అప్పగించారు. సాంకేతిక విద్య, ఎలక్ట్రానిక్స్, సైన్స్, టెక్నాలజీతో సహా ఉన్నత విద్యను గోవి చెజియాన్ చూసుకుంటారు. పర్యాటక శాఖ, షుగర్, చెరకు ఎక్సైజ్, చెరకు అభివృద్ధి శాఖలకు మంత్రిగా ఆర్.రాజేంద్రన్ ఉంటారు. ఎస్ఎం నాసర్‌కు మైనారిటీల సంక్షేమం, ప్రవాస తమిళుల సంక్షేమం, శరణార్థులు, తరలింపులు, వక్ఫ్ బోర్డు శాఖలను కేటాయించారు.
రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ఆయన నలుగురు మంత్రులకు స్టాలిన్ అభినందనలు తెలిపారు. ఇక ఉదయనిధి స్టాలిన్‌కు ఉప ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయడం పట్ల డీఎంకే నాయకులు, కార్యకర్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. ఉదయం నుంచి తమిళనాడు వ్యాప్తంగా పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చుతున్నారు. స్వీట్లను పంచిపెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డీఎంకే కార్యాలయాల వద్ద పండగ వాతావరణం నెలకొంది.
Read Also : Ponnam Prabhakar : ప్రతిపక్షాలకు ఇది మంచి పద్దతి కాదంటూ పొన్నం హెచ్చరిక