Tamil Nadu: తమిళనాడు మంత్రివర్గంలో తెలుగు బిడ్డ ఎస్. కీర్తన
- Author : Vamsi Chowdary Korata
Date : 10-05-2026 - 10:54 IST
Published By : Hashtagu Telugu Desk
తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాల ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించుతూ నటుడు విజయ్ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన, తన తొలి మంత్రివర్గాన్ని కూడా ప్రకటించారు. విభిన్న రంగాలకు చెందిన నిపుణులు, యువతకు ప్రాధాన్యమిస్తూ ఏర్పాటు చేసిన ఈ కేబినెట్లో పలు ఆసక్తికర ముఖాలు ఉన్నాయి.
విజయ్ మంత్రివర్గంలో 29 ఏళ్ల నటి ఎస్. కీర్తనకు చోటు దక్కడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. శివకాశి నుంచి గెలిచిన ఆమె, కేబినెట్లో అత్యంత పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు. పార్టీ ఆవిర్భావానికి ముందు విజయ్ ఫ్యాన్ క్లబ్ అధ్యక్షుడిగా ఉండి, ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎన్. ఆనంద్‌కు మంత్రివర్గంలో కీలక స్థానం లభించింది. అలాగే గతంలో డీఎంకే గెలుపులో వ్యూహకర్తగా పనిచేసిన బాస్కెట్‌బాల్ మాజీ క్రీడాకారుడు ఆధవ్ అర్జున, మాజీ ఐఆర్ఎస్ అధికారి డాక్టర్ కేజీ అరుణ్‌రాజ్, దంత వైద్యులు డాక్టర్ టీకే ప్రభు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు.
ఐదు దశాబ్దాల పాటు అన్నాడీఎంకేలో పనిచేసి, గతేడాది ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి విజయ్‌తో చేరిన సీనియర్ నేత సెంగొట్టైయన్కు కేబినెట్లో బెర్త్ దక్కింది. విజయ్‌కు సుదీర్ఘకాలంగా మేనేజర్‌గా ఉన్న అడ్వకేట్ పి. వెంకటరమణన్, పార్టీ ఐటీ విభాగం డిప్యూటీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ సైతం మంత్రులయ్యారు. విజయ్ ప్రకటించిన తొలి జాబితాలోని వారంతా ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీకి చెందినవారే కావడం గమనార్హం.