Bigg Boss Telugu Season 10: ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో బిగ్ బాస్ 10 తెలుగు సీజన్… ఈసారి కంటెస్టెంట్స్ వీళ్లేనా..?
- Author : Vamsi Chowdary Korata
Date : 10-07-2026 - 11:35 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా బాధ్యతలు చేపట్టనున్నట్లు ఇప్పటికే విడుదలైన టీజర్ ద్వారా స్పష్టమైంది. మైలురాయి సీజన్ కావడంతో ఈసారి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు నిర్వాహకులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇటీవల విడుదలైన ప్రచార వీడియోలో “గేమ్‌లో ఛాలెంజ్ కాదు.. గేమే ఒక ఛాలెంజ్” అనే ట్యాగ్‌లైన్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దీంతో ఈ సీజన్లో టాస్కులు, ఎలిమినేషన్లు, గేమ్ ప్లాన్లు గతంతో పోలిస్తే మరింత ఆసక్తికరంగా ఉండనున్నాయని అభిమానులు భావిస్తున్నారు. అలాగే ఈ సీజన్‌ను ‘దశావతారం’ అనే ప్రత్యేక థీమ్‌తో రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
గతంలో 16 నుంచి 22 మంది వరకు కంటెస్టెంట్లు పాల్గొనగా, ఈసారి థీమ్‌కు అనుగుణంగా కేవలం 10 మంది ప్రముఖులతోనే షోను నిర్వహించే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అయితే దీనిపై నిర్వాహకుల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ధృవీకరణ వెలువడలేదు. మరోవైపు కంటెస్టెంట్ల ఎంపికపై కూడా ఆసక్తికర చర్చ సాగుతోంది. నటి జ్యోతి, దీపికా రంగరాజు, ఉప్పల్ బాలు, కల్యాణ్, పల్లవి గౌడ, ఎక్స్‌ప్రెస్ హరి, తేజస్విని గౌడ, రాకింగ్ రాకేష్, పండు మాస్టర్, చంద్రహాస్ వంటి పలువురు ప్రముఖుల పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే ఇవి ప్రస్తుతం కేవలం ప్రచారంలో ఉన్న జాబితా మాత్రమే. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నట్లు తెలుస్తుండగా, షో ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే ప్రారంభ తేదీతో పాటు కంటెస్టెంట్ల పూర్తి జాబితాపై నిర్వాహకుల అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.