Khushbu: కరూర్ ఘటనపై ఖుష్బూ ఫైర్ – విజయ్‌కు బీజేపీ మద్దతు
తొక్కిసలాటకు ముందు పోలీసులు లాఠీచార్జ్ ఎందుకు చేశారు అనే విషయాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
- By Dinesh Akula Published Date - 01:48 PM, Sun - 5 October 25

కరూర్, తమిళనాడు: (Khushbu on Vijay) కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై డీఎంకే ప్రభుత్వంపై బీజేపీ నేత, నటి ఖుష్బూ సుందర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇది పూర్తిగా ప్రణాళిక ప్రకారమే జరిగిందని ఆరోపించారు. టీవీకే అధినేత విజయ్ సభకు సరైన స్థలం కేటాయించకపోవడమే కాకుండా, ముందస్తు భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు.
తొక్కిసలాటకు ముందు పోలీసులు లాఠీచార్జ్ ఎందుకు చేశారు అనే విషయాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే స్టాలిన్ మౌనం వీడి, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తోందని, తమిళనాడు ప్రజలందరికీ ఇది అర్థమైందన్నారు.
ఈ ఘటన నేపథ్యంలో బీజేపీ నేతలు విజయ్ పట్ల మద్దతు ప్రకటించటం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా బీజేపీ సీనియర్ నేత రాజా మాట్లాడుతూ, “విజయ్‌తో అభిప్రాయ భేదాలున్నా, కరూర్ ఘటన విషయంలో ఆయనకు మద్దతుగా నిలుస్తాం” అని స్పష్టం చేశారు. ఘటన జరిగిన సమయంలో టీవీకే కార్యకర్తలు సహాయక చర్యలు చేపట్టలేదని, విజయ్ వెంటనే చెన్నైకు వెళ్ళిపోయారని విమర్శలు రావడంతో బీజేపీ స్పందించటం గమనార్హం.
ALSO READ: CBN New Look : నయా లుక్ లో సీఎం చంద్రబాబు
ఈ ఘటనపై బీజేపీ ఎన్‌డీఏ ఎంపీల బృందాన్ని కరూర్‌కు పంపింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని వారు ప్రాథమికంగా తేల్చారు. మరోవైపు విజయ్ పార్టీ వేసిన సీబీఐ దర్యాప్తు పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. పోలీసుల దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలో ఉండగానే సీబీఐ విచారణ కోరడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టులను రాజకీయ వేదికలుగా ఉపయోగించవద్దని హెచ్చరించింది.
ఈ క్రమంలో విజయ్ అభిమానులను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న వార్తలు జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో టీవీకే పార్టీని బీజేపీ బీ-టీమ్‌గా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.