Kerala CM Tour: కేరళ సీఎం ‘లండన్’ పర్యటనకు 43 లక్షల ఖర్చు!
అక్టోబర్‌లో ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన బృందం లండన్ పర్యటనకు రూ.43 లక్షలు ఖర్చు చేసినట్లు ఆర్టీఐ వెల్లడించింది.
- By Balu J Published Date - 02:43 PM, Sat - 3 December 22

మంత్రులు, ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలు చేయడం అనేది సర్వసాధారణం. అయితే విదేశీ పర్యటనల పేరుతో లక్షలకు లక్షలు ఖర్చు చేయడం పట్ల ప్రతిపక్షాలతో పాటు సామాన్యులు సైతం మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన బృందం అక్టోబర్ లో లండన్ పర్యటనకు రూ.43 లక్షలు ఖర్చు చేసింది. ఈ మేరకు ఆర్టీఐ వెల్లడించింది. ఆర్టీఐ ప్రశ్నలకు భారత హైకమిషన్ లండన్ కార్యాలయం సమాధానమిచ్చింది. ముఖ్యమంత్రి విజయన్‌తో పాటు మరో ముగ్గురు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు అక్టోబర్ 8-12 వరకు లండన్ పర్యటన చేశారు. ఈ సమయంలో అన్ని ఖర్చులను కేరళ ప్రభుత్వం తరపున కమిషన్ భరించింది.
హోటల్ వసతి కోసం రూ. 28.54 లక్షలు, స్థానిక రవాణా ఖర్చు రూ. 22.38 లక్షలు, ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో కు గానూ రూ. 2.21 లక్షలు ఖర్చు చేసినట్టు తెలిపింది. ఈ పర్యటనలో సంతకాలు చేసిన అవగాహన ఒప్పందాలపై తమకు ఎలాంటి సమాచారం లేదని కమిషన్ కార్యాలయం పేర్కొంది. కేరళ ప్రభుత్వం కమిషన్ కార్యాలయానికి ఎటువంటి మొత్తాన్ని చెల్లించలేదని కూడా సూచించింది. విజయన్‌తో పాటు ఆయన భార్య, కుమార్తె, మనవడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వి.శివన్‌కుట్టి భార్య కూడా పర్యటనలో ఉండటం రాజకీయకంగా ప్రాధాన్యత సంతరించుకుంది.