CM Siddaramaiah : ముడా స్కాంలో సీఎం సిద్ధరామయ్య విచారణ.. గవర్నర్ సంచలన ఆదేశాలు
మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అనుమతి మంజూరు చేశారు.
- By Pasha Published Date - 02:23 PM, Sat - 17 August 24
CM Siddaramaiah : కర్ణాటక రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అనుమతి మంజూరు చేశారు. బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్తలు ఎస్.పి.ప్రదీప్ కుమార్, టి.జే.అబ్రహం, మైసూరుకు చెందిన స్నేహమయి క్రిష్ణలు అందించిన సమాచారం ఆధారంగా ముడా స్కాం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు దాని ఆధారంగా సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ ఆదేశించారు. దీనికి సంబంధించిన సమాచారం తమకు అందిందని కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
We’re now on WhatsApp. Click to Join
వాస్తవానికి బీజేపీ నేపథ్యం కలిగిన కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ ఈ తరహా ఆదేశాలు జారీ చేయడం ఇదే తొలిసారేం కాదు. గత నెలలోనూ సీఎం సిద్ధరామయ్యకు ఆయన షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ముడా స్కాం విషయంలో వస్తున్న ఆరోపణలపై వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆ నోటీసుల్లో గవర్నర్ కోరారు. ఈ కేసు వ్యవహారంపై మిమ్మల్ని ఎందుకు విచారించకూడదో సంజాయిషీ ఇవ్వాలని సీఎంకు పంపిన షోకాజ్ నోటీసుల్లో గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ ప్రస్తావించారు. అయితే అప్పట్లో గవర్నర్ ఆదేశాలను రాష్ట్ర క్యాబినెట్ ఖండించింది. గవర్నర్ పదవిని రాజకీయ ప్రయోజనాల కోసం థావర్ చంద్ దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించింది. ఆ షోకాజ్ నోటీసులను వెనక్కి తీసుకోవాలని గవర్నర్‌ను రాష్ట్ర క్యాబినెట్ గత నెలలో కోరింది. తాజాగా ఇప్పుడు సీఎం సిద్ధరామయ్యను ముడా స్కాంలో విచారించాలంటూ గవర్నర్ జారీ చేసిన ఆదేశాలపై కర్ణాటక క్యాబినెట్ ఎలా స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read :Buying Property : ప్లాట్ లేదా ఫ్లాట్ కొంటున్నారా ? ఈ డాక్యుమెంట్స్ తప్పక తనిఖీ చేయండి
ఏమిటీ ముడా స్కాం ?
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్య పేరు పార్వతి. ఆమె సోదరుడు మల్లికార్జున్ పేరిట మైసూరులోని కేసరే గ్రామంలో 3 ఎకరాల భూమి ఉండేది. దాన్ని అతడు పార్వతికి గిఫ్టుగా ఇచ్చాడు. ఆ వెంటనే మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) కీలక నిర్ణయం తీసుకుంది. పార్వతి వద్దనున్న భూమిని తీసుకోవాలని ముడా అధికారులు డిసైడ్ చేశారు. అందుకు పరిహారంగా 2021 సంవత్సరంలో దక్షిణ మైసూరులోని అత్యంత విలువైన విజయనగర్ ఏరియాలో 38,283 చదరపు అడుగుల ప్లాట్‌ను సీఎం సిద్ధరామయ్య భార్యకు కేటాయించారు. ముడా స్వాధీనం చేసుకున్న భూమి కంటే.. పరిహారంగా పార్వతికి ఇచ్చిన భూమి విలువే చాలా ఎక్కువ. ముడా స్కాంలో ఇదే ముఖ్యమైన అంశం. 2013 అసెంబ్లీ ఎన్నికల టైంలో సమర్పించిన అఫిడవిట్‌లో సిద్ధరామయ్య కేసరే గ్రామంలోని మూడెకరాల వ్యవసాయ భూమి గురించి ప్రస్తావించలేదనే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వం, రెవెన్యూ శాఖ అధికారుల సహకారంతో 2004లో సీఎం సిద్దరామయ్య భార్య సోదరుడు మల్లికార్జున్ అక్రమంగా భూమిని సేకరించి నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అయితే తన సతీమణి ఆ భూమికి సంబంధించి ముడా నుంచి పరిహారం పొందేందుకు అర్హురాలు అని సీఎం సిద్ధరామయ్య వాదిస్తున్నారు. 2014లో తాను ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే ఆమె పరిహారం కోసం దరఖాస్తు చేసుకుందని ఆయన ఒప్పుకుంటున్నారు. అయితే తాను సీఎంగా ఉన్నంతకాలం ఆ పరిహారం ఇవ్వడం కుదరదని అప్పట్లో చెప్పానని సిద్ధరామయ్య స్పష్టం చేస్తున్నారు. అందువల్లే 2021లో దరఖాస్తు చేసుకోగా.. అప్పటి బీజేపీ ప్రభుత్వం విజయనగరలో తన భార్యకు భూమి కేటాయించిందని సిద్ధరామయ్య చెబుతున్నారు.
Related News
Siddaramaiah Losing Top Post : నేనెందుకు సీఎం కాకూడదో చెప్పండి.. సిద్ధరామయ్య సలహాదారుడి సంచలన కామెంట్స్
వక్కలిగ, లింగాయత్ వర్గాలకు చెందిన తనలాంటి ప్రముఖ నేతలు చాలామందే కాంగ్రెస్‌లో ఉన్నారని.. వారిలో ఎవరి పేరునైనా సిద్ధరామయ్య కాంగ్రెస్ హైకమాండ్‌కు సిఫారసు చేసే అవకాశం ఉంటుందని బసవరాజ్ రాయరెడ్డి(Siddaramaiah Losing Top Post) చెప్పారు.