Alappuzha Express : అలప్పుళ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం.. ప్రయాణికుల పరుగులు
దీంతో వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ రైలును(Alappuzha Express) ఆపేశారు.
- By Pasha Published Date - 10:30 AM, Sat - 21 December 24

Alappuzha Express : జార్ఖండ్‌లోని ధనాబాద్ జంక్షన్ నుంచి కేరళలోని అలప్పుళకు వెళ్లే అలప్పుళ ఎక్స్‌ప్రెస్ రైలు (13351)లో అగ్ని ప్రమాదం సంభవించింది. రైలులోని బీ4, బీ5 బోగీల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన కేరళలోని మధుకరై స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. స్టేషన్‌లో ఉన్న సిబ్బంది మంటలను గుర్తించి సిగ్నల్ ఇచ్చారు. దీంతో వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ రైలును(Alappuzha Express) ఆపేశారు. ఆ వెంటనే రైలు నుంచి దిగి ప్రయాణికులు బయలకు పరుగులు తీశారు. తెలంగాణలోని ఇల్లందుకు చెందిన దాదాపు పదిమంది అయ్యప్ప స్వాములు ఈ రైలులోనే శబరిమలకు వెళ్తున్నట్లు తెలిసింది. అయితే వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదని సమాచారం.
Also Read :Nigerian Gangs : స్టూడెంట్స్, ఉద్యోగుల ముసుగులో డ్రగ్స్ దందా.. వాళ్లకు చెక్
అయ్యప్ప భక్తుల కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమలకు స్పెషల్ ట్రైన్స్‌ను నడుపుతున్నారు. విజయవాడ నుంచి కొల్లం వరకు వెళ్లే 07177 రైలు డిసెంబరు 21, 28 తేదీల్లో శనివారం రాత్రి 10.05 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి వెళ్తుంది. సోమవారం ఉదయం 6.20 గంటలకు ఈ రైలు కొల్లంకు చేరుకుంటుంది. డిసెంబరు 23, 30 తేదీల్లో కొల్లం నుంచి విజయవాడ వరకు నడిచే ప్రత్యేక రైలు(07178) కొల్లంలో ఉదయం 10.45 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు రాత్రి 9.00 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది.
24 రైళ్లు రద్దు
ఏపీ, తెలంగాణ మీదుగా నడిచే 24 రైళ్లను ఈ రోజు నుంచి మార్చి 2 వరకు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. బంగాళాఖాతంలో వచ్చే 12 గంటల్లో వాయుగుండం బలపడొచ్చనే సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రద్దయిన రైళ్ల వివరాలను సౌత్ సెంట్రల్ రైల్వే వెబ్సైట్లో అధికారులు వెల్లడించారు. వాయుగుండం ప్రభావంతో ఏపీలోని ఉత్తరకోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడొచ్చు. నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడొచ్చు.