Tamil Nadu: వీడెవడండీ బాబూ! చచ్చిన శవంలా పాడెపై వచ్చి మరీ మొక్కు చెల్లించుకున్నాడు!
- By hashtagu Published Date - 02:08 PM, Sun - 10 April 22

ఎవరైనా దేవుడు మొక్కు చెల్లించుకోవడానికి గుడికి ఎలా వెళతారు? బైకు మీదో, బస్సు మీదో, ఆటో మీదో, సైకిల్ మీదో, కారు మీదో వెళతారు. కొంతమంది కాలు నడకన వెళతారు. వీడెవండీ బాబు.. ఇవేవీ కాదనుకుని చచ్చిన శవంలా పాడె మీద పడుకుని.. శవయాత్ర చేయించుకుని మరీ గుడికి వచ్చాడు. అప్పుడు కానీ దేవుడి దర్శనం చేసుకోలేదు. తమిళనాడులో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.
మనిషికో పిచ్చి మహిలో సుమతి అన్నారు. తమిళనాడులో అలాంటి భక్తులను చూస్తే అదే అనిపిస్తుంది. ఎవరైనా దేవుడు మొక్కులు ఎలా చెల్లించుకుంటారు. పండ్లు, కొబ్బరికాయలు, అగరవత్తులు, కర్పూరం, పువ్వులు వీటిని తీసుకెళ్లి భగవంతుడి దర్శనం చేసుకుంటారు. కానీ తమిళనాడులోని సేలం జిల్లా జారికొండలాంపట్టి మారియమ్మన్ కాళియమ్మన్ ఉత్సవాలలో మాత్రం ఇలాంటి విచిత్రమైన సంఘటనలు కనిపిస్తాయి.
ఈ డమ్మీ శవయాత్ర కోసం భారీగానే ఏర్పాట్లు చేశారు. కొండలాంపట్టిలోనీ బస్టాండ్ లో ఓ పందిరి వేశారు. శవయాత్ర చేస్తే ఎలా అలంకరిస్తారో అలాగే డెకరేట్ చేశారు. చివరకు ఆ భక్తుడికి కూడా శవంలాగే మేకప్ చేశారు. ఇక అక్కడి నుంచి శవయాత్ర మొదలైంది. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులతోపాటు బంధువులు కూడా అంత్యక్రియలలో పాల్గొంటే ఎలా ఉంటారో.. అలాగే వ్యవహరించడంతో చుట్టుపక్కలవారు ఖంగుతిన్నారు.
పాడెపై వచ్చిన అతగాడు శ్మశానం వరకు శవయాత్రగానే వెళ్లాడు. కాకపోతే ఆయన వెంట తీసుకువచ్చిన కోడిని అక్కడ పూడ్చిపెట్టారు. తరువాత అక్కడి నుంచి గుడికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకున్నాడు. ఇప్పటివరకు వివిధ రకాల మొక్కుల గురించి చూశాం కాని, ఇలాంటి మొక్కుబడిని ఇప్పుడే చూశామంటున్నారు స్థానికులు. దీంతో ఈ ఘటన కాస్తా వైరల్ గా మారింది.