OG Review : OG – ఇదే కదా ఫ్యాన్స్ కోరుకునేది
- By Sudheer Published Date - 06:05 AM, Thu - 25 September 25

మూడేళ్లుగా అభిమానులను ఊరిస్తూ వస్తున్న ‘They Call Him OG’ (OG) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ ఆ అంచనాలను అందుకోవడం లో సక్సెస్ అయ్యింది. 90ల నాటి ముంబయి మాఫియా నేపథ్యంలో సాగిన ఈ కథలో పవన్ (Pawan) ఓజాస్ గంభీరగా, బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ ఒమీ భవ్‌గా కనిపించగా..ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. అర్ధరాత్రి నుండే వరల్డ్ వైడ్ గా OG మేనియా మొదలైంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఇది కదా పవన్ నుండి కోరుకునేది అంటూ చెపుతున్నారు.
ఇక కథ విషయానికి వస్తే..
ముంబై పోర్ట్ కి దాదా గా పిలువబడే సత్య దాదా (ప్రకాష్ రాజ్) కి అండగా ఓజాస్ గంభీర (పవన్ కళ్యాణ్) ఉంటాడు. కానీ ఓ సంఘటన చేత గంభీర.. సత్య దాదా నుంచి దూరం అవుతాడు. గంబీర దూరం కావడం తో చాలామంది ఆ పోర్ట్ ను దక్కించుకోవాలని చూస్తారు. అసలు గంభీర ఎందుకు సత్య దాదాకి దూరం అయ్యాడు? గంబీర కు దాదా కు ఏసంబంధం..? అర్జున్ (అర్జున్ దాస్) గంభీరని ఎందుకు చంపాలి అనుకుంటాడు. ఓమిగా పిలవబడే ఓంకార్ (ఇమ్రాన్ హష్మీ) ఎలా వచ్చాడు..? ఈ కథకు అతడికి సంబంధం ఏంటి..? గంబీర మళ్లీ ముంబై వచ్చాడా..? చివరకు ఏమవుతుంది అనేది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది.
సినిమా కథలో ప్రధాన బలం పవన్ కళ్యాణ్ పాత్ర. ఓజాస్ గంభీర ఎంట్రీ నుండి క్లైమాక్స్ వరకు ప్రతి సీన్‌ను ఆయన తన స్టైల్, స్వాగ్‌తో నింపేశారు. ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఇంట్రడక్షన్ ఫైట్, పోలీస్ స్టేషన్ ఎపిసోడ్, ఇంటర్వెల్ బ్లాక్ వంటి సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. పవన్ చేతిలో కటానా చూసిన ప్రతి ఫ్యాన్ థియేటర్‌లో కేరింతలు కొట్టక మానడు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమా హై పిచ్‌కు తీసుకెళ్లాడు. అలాగే రవికే చంద్రన్ తీసిన అద్భుతమైన విజువల్స్ ముంబయి అండర్‌వర్డ్ వాతావరణాన్ని నిజమైనదిగా చూపించాయి.
అయితే సినిమా ప్రధాన లోపం కథలోనే ఉంది. పవన్ ఎలివేషన్ సీన్స్, యాక్షన్ బ్లాక్స్ బాగానే ఉన్నప్పటికీ, కథనం మాత్రం బలహీనంగా ఉంది. రెండో భాగంలో పలు సన్నివేశాలు ఊహించదగ్గవిగా అనిపించాయి. పవన్-ఇమ్రాన్ మధ్య కన్ఫ్రంటేషన్‌లు మరింత బలంగా రాసి ఉంటే ప్రభావం మరింత పెరిగేది. ప్రకాశ్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, ప్రియాంక మోహన్ పాత్రలకు సరైన డెవలప్‌మెంట్ లేకపోవడం మరో మైనస్ పాయింట్. ముఖ్యంగా హష్మీ తెలుగు సినిమాకు మంచి ఆరంభం చేసుకున్నా, ఆయన పాత్రను మరింత లోతుగా చూపించే అవకాశం మిస్ అయ్యారు.
కథ ఎలా ఉన్నప్పటికీ పవన్ నుండి అభిమానులు కోరుకునే అంశాలు పుష్కలంగా ఉండడం తో వారు సంబరాలు చేసుకుంటున్నారు. పవన్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ ఎపిసోడ్‌లు, థమన్ మ్యూజిక్, గ్రాండ్ ప్రొడక్షన్ విల్యూస్ సినిమాను నిలబెట్టాయి. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ నుండి అభిమానులు ఇంకొరుకుంటున్నారో.. సుజీత్ తెరపై చూపించి సక్సెస్ అయ్యాడు.