Sleep Champion : హాయిగా నిద్రపోయి రూ.9 లక్షలు గెల్చుకున్న యువతి.. ఎలా ?
ఆమెకు 'స్లీప్ ఛాంపియన్'(Sleep Champion) టైటిల్‌ను కూడా ప్రదానం చేశారు.
- By Pasha Published Date - 01:43 PM, Mon - 30 September 24

Sleep Champion : వేక్‌ఫిట్ కంపెనీ ఒక వెరైటీ ఇంటర్న్ షిప్ ప్రాజెక్టును అమలు చేసింది. దీనిలో పాల్గొన్నవారంతా ప్రశాంతంగా నిద్రపోయారు. బెంగళూరుకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ సాయిశ్వరీ పాటిల్ ఈ ఇంటర్న్ షిప్‌లో పాల్గొని అందరి కంటే బెటర్‌గా నిద్రపోయారు. దీంతో ఆమెకు ఏకంగా రూ.9 లక్షల పారితోషికాన్ని వేక్‌ఫిట్ కంపెనీ ఇచ్చుకుంది. ఈ ఇంటర్న్ షిప్ ప్రాజెక్టు చివరి రౌండ్‌లో మొత్తం 12 మంది పాల్గొనగా.. చక్కగా నిద్రపోయినందుకు సాయిశ్వరీ పాటిల్‌ను ఈ పారితోషికానికి ఎంపిక చేశారు. ఆమెకు ‘స్లీప్ ఛాంపియన్'(Sleep Champion) టైటిల్‌ను కూడా ప్రదానం చేశారు. తమ కంపెనీ స్లీప్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను నిర్వహించడం ఇది మూడోసారి అని వేక్‌ఫిట్ కంపెనీ వెల్లడించింది. ఈ ఇంటర్న్‌షిప్‌లో పాల్గొన్నవారు రోజూ సగటున 8 నుంచి 9 గంటల పాటు కచ్చితంగా నిద్రపోవాలి. పగటిపూట కనీసం 20 నిమిషాలు కునుకు తీయాలి. వారు నిద్రపోతున్న తీరును కచ్చితత్వంతో ట్రాక్ చేయడానికి వేక్ ఫిట్ కంపెనీకి చెందిన ప్రీమియం మ్యాట్రెస్‌కు కాంటాక్ట్‌లెస్ స్లీప్ ట్రాకర్‌ను అమర్చారు. నిద్ర అలవాట్లను మెరుగుపర్చుకోవడానికి ఏం చేయాలనే దానిపై ఈ ఇంటర్న్‌షిప్‌లో పాల్గొన్నవారికి అవగాహన కల్పించడానికి నిద్ర నిపుణుల నేతృత్వంలోని వర్క్‌షాప్‌లను నిర్వహించారు. వాటి ద్వారా నాలెడ్జ్‌ను పెంచుకుంటూ ఇంటర్న్‌షిప్‌లో పాల్గొన్నవారు పోటాపోటీగా , సౌకర్యవంతంగా నిద్రపోయే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో ఇతర పోటీదారుల కంటే సాయిశ్వరీ పాటిల్ ముందంజలో నిలిచారు. దీంతో ఆమెను ‘స్లీప్ ఛాంపియన్’ టైటిల్ వరించింది.
Also Read :Russia Vs Ukraine : 6.51 లక్షల మంది రష్యా సైనికులను మట్టుబెట్టాం : ఉక్రెయిన్ ఆర్మీ
ఈసారి వేక్‌ఫిట్ మూడో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంకు 10 లక్షల కంటే ఎక్కువ మంది అప్లై చేశారు. అయితే తొలిదశలో వారిలో 51 మందిని ఎంపిక చేశారు. వారికి దాదాపు రూ. 63 లక్షల స్టైపెండ్‌లు చెల్లించారు. ఈ అధ్యయనంలో పలు కీలక వివరాలను గుర్తించారు. నిద్రపోయే చోటులో ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడంతో చాలామంది కంఫర్ట్‌గా నిద్రపోలేక పోతున్నారని స్టడీలో తేలింది. తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్ల కొందరికి మంచి నిద్ర రావడం లేదని స్టడీ రిపోర్టు పేర్కొంది. మానసిక ఒత్తిడి వల్ల కొందరు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారని తెలిపింది.