Save The Tigers 3 Review: సేవ్ ది టైగర్స్ 3 రివ్యూ
- Author : Vamsi Chowdary Korata
Date : 18-06-2026 - 3:51 IST
Published By : Hashtagu Telugu Desk
మహి వి రాఘవ్ క్రియేట్ చేసిన ‘సేవ్ ది టైగర్స్’ ప్రస్తుతం ఒక సెన్సేషన్. ఇప్పటికే రెండు సీజన్‌లు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఇక మూడో సీజన్‌తో మళ్లీ నవ్వించేందుకు ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ ద్వయం రెడీ అయ్యారు. శ్రీరామ్ ఎరగం దర్శకత్వం వహించిన ఈ మూడో సిరీస్ ఎలా ఉంది? కథ ఏంటి? అన్నది తెలుసుకుందాం.
కథ
గంటా రవి (ప్రియదర్శి), రాహుల్ (అభినవ్ గోమటం), విక్రమ్ (చైతన్యకృష్ణ) ఓ పబ్ దగ్గర వెయిట్ చేస్తుంటారు. ఆ ముగ్గురూ కలిసి ఇంకో ముగ్గుర్ని కిడ్నాప్ చేస్తారు. ఆ ముగ్గురూ, ఈ ముగ్గురిలాగే ఉంటారు. అలా ఒకే పోలికలతో ఎలా ఉన్నారు? వీరికి ఉన్న రిలేషన్ ఏంటి? అనే ఆసక్తికరమైన ప్రశ్నలతో ఎపిసోడ్ అలా సార్ట్ అవుతుంది. ఈ లోకంలో గంటా రవి (ప్రియదర్శి), రాహుల్ (అభినవ్ గోమటం), విక్రమ్ (చైతన్యకృష్ణ) పడే బాధలు ఇది వరకే అందరికీ తెలుసు. ఎమ్మెల్యే టికెట్ కోసం డబ్బులన్నీ వృథాగా ఖర్చు పెడతాడు గంటా రవి. హైమా (సుజాత) గోల పెట్టడంతో రవి గేటెడ్ కమ్యూనిటీలోకి వచ్చి ఉంటాడు. మాధురి (పావని గంగిరెడ్డి) సూచన మేరకు రైటింగ్ ఆపేసి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తుంటాడు రాహుల్. అయితే ఆ జాబ్ పోవడంతో మళ్లీ హైదరాబాద్‌కు వస్తాడు రాహుల్. ఇంకో వైపు రేఖ (దేవియాని శర్మ) విక్రమ్ నుంచి విడాకులు కోరుతుంది. ఇలా రవి, రాహుల్, విక్రమ్ తమ తమ సంసారంలోని బాధలను పంచుకుంటూ పెళ్లి అనే సంప్రదాయం, వ్యవస్థపై ఫ్రస్ట్రేషన్‌తో ఉంటారు. ఈ ఫ్రస్ట్రేషన్‌లో ఆ ముగ్గురూ స్వర్గంలో ఉన్న ఇంద్రుడిని (వెన్నెల కిషోర్) తిడతారు. ఆ ముగ్గురి బాధ ఏంటో కాస్త చూడమని గుప్తా(గుండు సుదర్శన్)కి చెప్తాడు ఇంద్రుడు. దీంతో గుప్తా ఏడు లోకాలను పరిశీలిస్తాడు. మొదటి లోకంలో ఈ ముగ్గురికి లేని సుఖాలు.. రెండో లోకంలో ఉన్న మరో ముగ్గురిలో కనిపిస్తాయి. రెండో లోకంలో ఉన్న ఆ ముగ్గురూ మహా జాదుగాళ్లు. అయితే గుప్తా మాత్రం ఈ మొదటి లోకంలో ఉన్న ముగ్గురిని, ఆ రెండో లోకంలో ఉన్న ఆ ముగ్గురితో స్వాప్ చేయాలని అనుకుంటాడు. ఆ తరువాత ఏం జరిగింది? ఆ ముగ్గురికి ఈ ముగ్గురితో వచ్చిన సమస్యలు ఏంటి? అక్కడి వరకు ఇక్కడకు.. ఇక్కడి వారు అక్కడికి వెళ్లిన తర్వాత ఏర్పడిన గందరగోళ పరిస్థితులు ఏంటి? అన్నది కథ.
సేవ్ ది టైగర్స్ మూడో సీజన్ కోసం ఎంచుకున్న పాయింట్ బాగుంటుంది. రెండు లోకాలు.. రెండు భిన్న మనస్తత్వాలున్న మనుషులు.. వారిని స్వాపింగ్ చేసే కాన్సెప్ట్ బాగానే అనిపిస్తుంది. మనకి పాత కాలంలో ఇదే కాన్సెప్ట్‌తో సినిమాలు కూడా వచ్చాయి. మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని ఒక నానుడి. చిరంజీవి నటించిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాలో ఏడు లోకాలు తిప్పి.. నచ్చిన లోకంలో.. నచ్చిన వ్యక్తిలోకి ప్రవేశపెడతాడు యముడు. ఇక ఇందులోనూ అలాంటి కాన్సెప్ట్‌నే వాడుకున్నారు. ఈ లోకంలో కష్టాలు ఎక్కువయ్యాయి.. సుఖం అనేదే లేకుండా పోయింది.. అదృష్టం కలిసి రావడం లేదు అని బాధపడే రవి, రాహుల్, విక్రమ్‌లను అన్ని సుఖాలు, అదృష్టాలను అనుభవించే రెండో లోకంలోని రవి, రాహుల్, విక్రమ్‌లతో స్వాప్ చేయిస్తాడు గుప్తా.
ఆ లోకంలోకి ఈ ముగ్గురు వెళ్లడం.. ఈ లోకంలోకి ఆ ముగ్గురు రావడంతో కథలో ఫన్ మరింతగా జనరేట్ అవుతుంది. మొదటి రెండు ఎపిసోడ్స్ ఇంట్రడక్షన్‌లా అనిపిస్తాయి. మూడో ఎపిసోడ్ నుంచి ఫన్ తారాస్థాయికి చేరుతుంది. నాలుగు, ఐదు ఎపిసోడ్స్‌లో ఈ లోకం, ఆ లోకంలోని తేడా, వారు పడే బాధల్ని చూపిస్తూ మరింత ఎంటర్టైనింగ్‌గా మలిచారు. ఇక చివర్లో కాస్త సందేశాత్మకంగా సాగినట్టు అనిపిస్తుంది. కావాల్సినంత ఫన్, ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే అంతర్లీనంగా మహిళా సాధికారత, మంచి చెడుల మధ్య బేధాన్ని చక్కగా చూపించినట్టు అనిపిస్తుంది.
మొదటి లోకంలో ఇండిపెండెంట్‌గా ఉండే పాత్రలు.. రెండో లోకంలో భర్తలకు బానిసల్లా ఉంటారు. ఈ లోకంలో భార్యలకు సపోర్ట్ చేసే భర్తలు.. ఆ లోకంలో శాడిస్టుల్లా ప్రవర్తిస్తుంటారు. అలా ప్రతి ఒక్క క్యారెక్టర్‌కు రెండు రకాల వేరియేషన్స్ చూపించే అవకాశం దక్కినట్టు అయింది. దొరికిన అవకాశాన్ని ఆర్టిస్టులందరూ చక్కగా వాడుకున్నారు. ప్రియదర్శి, అభినవ్, చైతన్య పాజిటివ్‌గానూ, నెగెటివ్‌గానూ అలా రెండు యాంగిల్స్‌తో ఆకట్టుకుంటారు. రోహిణి అయితే మరోసారి నవ్వించేసింది. క్లైమాక్స్ మొత్తం రోహిణి కబ్జా చేసినట్టు అనిపిస్తుంది. ఆమె ఎంట్రీకి, యాక్షన్ సీక్వెన్స్‌కి విజిల్స్ పక్కా. వెన్నెల కిషోర్, అభయ్, గుండు సుదర్శన్, గంగవ్వ, శ్రీకాంత్ అయ్యంగార్, హర్ష వర్దన్ ఇలా ప్రతి ఒక్క పాత్ర రిజిస్టర్ అవుతుంది.
టెక్నికల్‌గా చూసుకుంటే సేవ్ ది టైగర్స్ మూడో సీజన్ మెప్పిస్తుంది. అజయ్ అరసాడ ఆర్ఆర్ చాలా వరకు సీన్లకు తగ్గట్టుగా ఫన్నీగా, ఎమోషనల్‌గా సాగుతుంది. కెమెరా వర్క్ కూడా రిచ్‌గా ఉంటుంది. ఎడిటింగ్ కూడా ఓ ఫ్లోతో సాగుతుంది. మాటలు కొన్ని చోట్ల బార్డర్ దాటినట్టు అనిపిస్తుంది. ఓటీటీ కంటెంట్ కాబట్టి.. ఇలాంటి డైలాగ్స్ కామన్ అని ఆడియెన్స్ కూడా లైట్ తీసుకుంటారేమో. పేరెంటింగ్, వైఫ్ అండ్ హజ్బెండ్ రిలేషన్ ఇలా చాలా విషయాల మీద అంతర్లీనంగా మంచి సందేశాన్ని ఇచ్చారు.
సేవ్ ది టైగర్స్ 3 సిరీస్‌ను అసభ్యత, అశ్లీలత అన్నది లేకుండా చాలా వరకు క్లీన్‌గా రూపొందించారు. ఫ్యామిలీ అంతా కలిసి ఎలాంటి బెరుకు, భయం లేకుండా హాయిగా చూసేలానే తెరకెక్కించారు. హాయిగా కాసేపు నవ్వుకుని ఎంజాయ్ చేయాలని అనుకునే వారికి ఈ సిరీస్ ఒక మంచి ఆప్షన్‌గా నిలిచే అవకాశం ఉంది.