ఆవాల నూనె వాడడం సురక్షితమేనా?..దీర్ఘకాల వినియోగం గుండె జబ్బులకు దారితీస్తుందా?
ఉత్తర భారతదేశంలో ఇది విస్తృతంగా వాడుకలో ఉంది. వంటలకే కాదు చర్మ సంరక్షణ కోసం కూడా కొందరు ఆవాల నూనెను ఉపయోగిస్తారు. అయితే ఆవాల నూనెను నిత్యం వంటల్లో వాడడం సురక్షితమేనా? దీర్ఘకాల వినియోగం గుండె జబ్బులకు దారితీస్తుందా? వంటి సందేహాలు చాలామందిలో ఉన్నాయి.
- Author : Latha Suma
Date : 24-01-2026 - 4:45 IST
Published By : Hashtagu Telugu Desk
. ఆవాల నూనెలో పోషకాలు..లాభాలు
. గుండె ఆరోగ్యంపై ఆవాల నూనె ప్రభావం
. వినియోగంలో జాగ్రత్తలు..ఎంత మోతాదులో వాడాలి?
Mustard Oil : మన రోజువారీ ఆహారంలో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. రుచికి, వంట విధానానికి, ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా మనం వివిధ రకాల నూనెలను ఉపయోగిస్తుంటాం. అలాంటి నూనెల్లో ఆవాల నూనెకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఇది విస్తృతంగా వాడుకలో ఉంది. వంటలకే కాదు చర్మ సంరక్షణ కోసం కూడా కొందరు ఆవాల నూనెను ఉపయోగిస్తారు. అయితే ఆవాల నూనెను నిత్యం వంటల్లో వాడడం సురక్షితమేనా? దీర్ఘకాల వినియోగం గుండె జబ్బులకు దారితీస్తుందా? వంటి సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆవాల నూనెపై జరిగిన అధ్యయనాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆవాల నూనెలో ప్రధానంగా యురుసిక్ ఆమ్లం అధికంగా ఉంటుంది. ఇది సుమారు 30 నుంచి 50 శాతం వరకు ఉండే మోనో అన్‌శాచురేటెడ్ ఒమెగా–9 కొవ్వు ఆమ్లం. కొన్ని అంతర్జాతీయ సంస్థలు ముఖ్యంగా ఫెడరల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) వంటి సంస్థలు, యురుసిక్ ఆమ్లం కారణంగా ఆవాల నూనెను ప్రధానంగా బాహ్య వినియోగానికే అనుకూలమని పేర్కొన్నాయి. అధికంగా తీసుకుంటే మయోకార్డియల్ లిపిడోసిస్ అనే పరిస్థితి వచ్చే అవకాశం ఉందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది గుండె కండరాల్లో కొవ్వు పేరుకుపోయే సమస్య. అయితే దీనికి భిన్నంగా భారతదేశంలో జరిగిన అనేక అధ్యయనాలు ఆవాల నూనె గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నాయి. భారతీయ కార్డియాలజిస్టులు దీన్ని సంప్రదాయ వంట నూనెగా సమర్థిస్తున్నారు.
ఆవాల నూనెలో ఉన్న అధిక MUFA (మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్) ధమనుల్లో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో అథెరోస్క్లెరోసిస్ కరోనరీ హార్ట్ డిసీజ్ వంటి సమస్యల ప్రమాదం తగ్గుతుంది. కొన్ని భారతీయ అధ్యయనాల ప్రకారం ఆవాల నూనెను నియమితంగా వాడే వారిలో గుండె జబ్బుల ముప్పు సుమారు 70 శాతం వరకు తగ్గినట్టు తేలింది. ఇంకా ఆవాల నూనెకు అధిక పొగ బిందువు (సుమారు 250 డిగ్రీల సెల్సియస్) ఉండటం మరో ప్రయోజనం. ఎక్కువ వేడి చేసినా ఇది విషపూరిత సమ్మేళనాలుగా మారదు. అందువల్ల భారతీయ వంటకాలకు ఇది సురక్షితమైన నూనెగా పరిగణిస్తారు. రక్తనాళాల స్థితిస్థాపకతను మెరుగుపరచడం ద్వారా రక్తపోటు నియంత్రణలో కూడా ఇది సహాయపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఆవాల నూనెకు లాభాలున్నప్పటికీ దుష్ప్రభావాలు లేవనికాదు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారు అధిక యురుసిక్ ఆమ్లం ఉన్న ఆవాల నూనెను తీసుకోకుండా ఉండటం మంచిది. సున్నితమైన చర్మం ఉన్నవారు శిశువులపై ఆవాల నూనెను రాయడం వల్ల చర్మం ఎర్రబడటం బొబ్బలు రావడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అత్యంత ముఖ్యంగా ఆర్జిమోన్ నూనెతో కల్తీ చేసిన ఆవాల నూనె ఆరోగ్యానికి తీవ్ర హానికరం. ఇది డ్రాప్సీ అనే వ్యాధికి కారణమై, తీవ్రమైన గుండె వైఫల్యానికి దారితీసే ప్రమాదం ఉంది. అందువల్ల నాణ్యమైన కల్తీ లేని నూనెనే ఉపయోగించాలి. నిపుణుల సూచన ప్రకారం ఒక వ్యక్తి రోజుకు 15 నుంచి 20 మిల్లీలీటర్ల వరకు మాత్రమే ఆవాల నూనెను తీసుకోవాలి. సరైన మోతాదు నియంత్రిత వినియోగం మంచి నాణ్యత ఉంటే ఆవాల నూనె గుండె ఆరోగ్యానికి మేలు చేసే వంట నూనెగానే నిలుస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.