Brain Power : బ్రెయిన్ పవర్ పెంచుకోవాలనుకుంటున్నారా? ఈ ఫుడ్స్ తప్పక అలవాటు చేసుకోండి
Brain Power : ప్రస్తుత పోటీ ప్రపంచంలో అందరూ తెలివి తేటలు పెంచుకోవాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇటీవలి కాలంలో చాలా మంది ఒత్తిడి కారణంగా నిద్రసరిగాపోవడం లేదు.
- By Kavya Krishna Published Date - 05:00 PM, Tue - 19 August 25

Brain Power : ప్రస్తుత పోటీ ప్రపంచంలో అందరూ తెలివి తేటలు పెంచుకోవాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇటీవలి కాలంలో చాలా మంది ఒత్తిడి కారణంగా నిద్రసరిగాపోవడం లేదు. ఫలితంగా మతిమరుపును పొందుతున్నారు. దీనంతటికి సరైన జీవనశైలిని పాటించకపోవడమే కారణమని తెలుస్తోంది. ఆహారపు అలవాట్లు, నిద్ర క్రమం కూడా ఇందుకు ప్రధాన కారణం కావొచ్చు. బ్రెయిన్ పవర్ పెంపొందించుకోవాలంటే సరైన పోషకాలున్న ఆహారం, మంచి నిద్ర, వ్యాయామం, యోగా ఎంతగానో ఉపయోగపడతాయి. మెదడు శక్తిని పెంచడానికి చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పద్ధతుల గురించి తెలుసుకుందాం.
ముందు ఆహారం ఏం తినాలి?
మెదడు శక్తిని పెంచడానికి మనం తీసుకునే ఆహారం చాలా ముఖ్యమైనది. నట్స్, విత్తనాలు, గ్రీన్ టీ, ముదురు రంగులో ఉండే చాక్లెట్ వంటివి మెదడుకు చాలా మంచివి. నట్స్, విత్తనాలలో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. గ్రీన్ టీలో ఉండే ఎల్-థియనిన్ అనే అమైనో ఆమ్లం జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది. మీరు బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్రకోలీ, బచ్చలికూర వంటి పండ్లు, కూరగాయలను కూడా మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. అలాగే, డ్రైఫ్రూట్స్‌లో బాదం, వాల్‌నట్‌లు, ఖర్జూరాలు మెదడు ఆరోగ్యానికి చాలా మంచివి.
నిద్ర గురించి మాట్లాడుకుంటే..
జ్ఞాపకశక్తిని పెంచడానికి సరైన నిద్ర చాలా అవసరం. ఒక వయోజనుడు రోజుకు 7-8 గంటల నిద్ర పోవాలి. నిద్ర సమయంలో మెదడు తాను గ్రహించిన సమాచారాన్ని నిల్వ చేసుకుంటుంది. తగినంత నిద్ర లేకపోతే, జ్ఞాపకశక్తి తగ్గుతుంది. అంతేకాకుండా, మెదడు అలసిపోవడం వల్ల సరైన ఆలోచనలు రాకపోవచ్చు. అందుకే, మెదడును ఉత్తేజంగా ఉంచడానికి మంచి నిద్ర చాలా ముఖ్యం.
యోగా కూడా ముఖ్యమైన భాగమే..
మెదడును చురుకుగా ఉంచడంలో యోగా కూడా కీలక పాత్ర పోషిస్తుంది. రోజుకు కనీసం 15-20 నిమిషాలు యోగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత పెరుగుతుంది. పద్మాసనం, వృక్షాసనం, తాడాసనం వంటివి మెదడుకు రక్త ప్రసరణను పెంచి, ఆలోచనా శక్తిని మెరుగుపరుస్తాయి. యోగాతో పాటు శ్వాస వ్యాయామాలు, ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
అంతేకాకుండా, క్రమం తప్పకుండా కొత్త విషయాలను నేర్చుకోవడం, మెదడుకు పదును పెట్టే పజిల్స్, సుడోకు వంటి ఆటలు ఆడటం వల్ల మెదడు చురుకుగా ఉంటుంది. సరైన ఆహారం, తగినంత నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేయడం వల్ల మెదడు శక్తిని పెంచుకోవడమే కాకుండా, మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపడి, జీవితంలో మనం అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడతాయి.