Mutton Pulusu : మటన్ పులుసు.. ఇలా చేస్తే ముక్క వదలకుండా తింటారు..
మటన్ తో రకరకాల వంటలు చేసుకోవచ్చు. మటన్ ఇగురు, గోంగూర మటన్, దోసకాయ మటన్.. రుచిగా చాలా వండుకోవచ్చు. అలాగే పులుసు కూడా చేసుకోవచ్చు. అన్నం, చపాతీ, రాగి సంకటి.. ఇలా దేనితో కలిపి తినేందుకైనా టేస్టీగా ఉంటుంది.
- Author : News Desk
Date : 29-04-2024 - 9:11 IST
Published By : Hashtagu Telugu Desk
Mutton Pulusu Recipe : మటన్ తో రకరకాల వంటలు చేసుకోవచ్చు. మటన్ ఇగురు, గోంగూర మటన్, దోసకాయ మటన్.. రుచిగా చాలా వండుకోవచ్చు. అలాగే పులుసు కూడా చేసుకోవచ్చు. అన్నం, చపాతీ, రాగి సంకటి.. ఇలా దేనితో కలిపి తినేందుకైనా టేస్టీగా ఉంటుంది. వండుకోవడం కూడా చాలా ఈజీ. పక్కా కొలతలతో చేసుకుంటే.. మటన్ పులుసు ఎంతో రుచిగా ఉంటుంది.
మటన్ పులుసు తయారు చేసేందుకు కావలసిన పదార్థాలు
నూనె – 4 టేబుల్ స్పూన్లు
మీడియంగా తరిగిన ఉల్లిపాయలు – 2
చీల్చిన పచ్చిమిర్చి – 2
పసుపు – 1/4 టీ స్పూన్
కారం – 1 టీ స్పూన్
దాల్చిన చెక్క – ఇంచు ముక్క, లవంగాలు – 5
జీలకర్ర – 1/2 స్పూన్
ఎండుకొబ్బరి ముక్కలు – 1 టేబుల్ స్పూన్
గసగసాలు – 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెమ్మలు – 8
అలాగే అరకిలో మటన్, కొద్దిగా ఉప్పు, 1/4 పసుపు టీ స్పూన్, 1 టీస్పూన్ కారం, 1 అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 గ్లాసులు నీళ్లు.
మటన్ పులుసు కర్రీ తయారు చేసే విధానం
కుక్కర్ లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్, ఇతర పదార్థాలు వేసి.. మూతపెట్టి 4-6 విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. మరో స్టవ్ పై కళాయి పెట్టుకుని.. వెల్లుల్లి మినహా మిగిలిన మసాలా పదార్థాలను వేయించుకుని.. చల్లారిన తర్వాత జార్ లోకి తీసుకోవాలి. అందులోనే వెల్లుల్లిని కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. కళాయిలో నూనె వేసి వేడి చేసుకుని.. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. పసుపు, ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు ఉడికించుకున్న మటన్ ను నీటితో కలిపి వేసుకోవాలి. దానిపై మూత పెట్టి.. 4 నిమిషాలు ఉడికించాక మిక్సీ పట్టుకున్న పొడిని వేసుకుని కలుపుకోవాలి. మళ్లీ మూత పెట్టి.. పులుసు దగ్గరగా అయ్యేంతవరకూ ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. టేస్టీ టేస్టీ మటన్ పులుసు రెడీ. రైస్, రోటీ, చపాతి, ఇడ్లీ, దోశల్లో ఎంచక్కా తినేయచ్చు.