Munagaku Pesarapappu : మునగాకు పెసరపప్పు కూర ఎలా తయారీ చేయాలో తెలుసా?
మునగాకుతో కూర, పప్పు, పచ్చడి, పొడి.. ఇలా రకరకాల ఐటమ్స్ చేసుకొని తింటారు. మునగాకులో అనేక పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నాయి.
- Author : News Desk
Date : 28-07-2023 - 11:00 IST
Published By : Hashtagu Telugu Desk
మునగాకులో అనేక పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. మునగాకు తినడం వలన మన రక్తంలో చక్కర స్థాయిలు తగ్గుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. మూత్రపిండాలు ఆరోగ్యంగా తయారవుతాయి. చర్మం, జుట్టు ఆరోగ్యంగా తయారవుతాయి. ఇలా అనేక రకాలుగా మునగాకు మనకు ఎంతో సహాయపడుతుంది. ఇక మునగాకుతో కూర, పప్పు, పచ్చడి, పొడి.. ఇలా రకరకాల ఐటమ్స్ చేసుకొని తింటారు.
మునగాకు పెసరపప్పు కూర తయారీకి కావలసిన పదార్థాలు:-
* మునగాకు ఒక కప్పు
* నానబెట్టిన పెసరపప్పు ఒక కప్పు
* పచ్చి కొబ్బరి తురుము అర కప్పు
* ఉప్పు తగినంత
* పచ్చిమిర్చి ఆరు
* ఎండుమిర్చి రెండు
* తాలింపు దినుసులు ఒక స్పూన్
* నూనె రెండు స్పూన్లు
* ఒక కరివేపాకు రెబ్బ
* పసుపు కొద్దిగా
మునగాకు పెసరపప్పు కూర తయారీ విధానం..
మునగాకుని ముందుగా కడుక్కొని ఒక గిన్నెలో పెసరపప్పు, మునగాకు, పచ్చిమిర్చిని తీసుకొని నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి ఉడికించాలి. ఉడికించిన దానిలో ఉప్పు, పసుపు వేసి కలిపి ఉంచుకోవాలి. ఒక గిన్నెలో నూనె వేసి తాలింపు దినుసులు వేయాలి. వేగిన తరువాత ఎండుమిర్చి వెయ్యాలి, కరివేపాకు రెబ్బలు వేయాలి. తరువాత పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించాలి. అది వేగిన తరువాత మనం ఉడికించి పెట్టుకున్న మునగాకు పెసరపప్పును ఈ గిన్నెలో వేయాలి. పొడి పొడి గా అయ్యే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చెయ్యాలి. మునగాకు పెసరపప్పు కూర రెడీ అవుతుంది. దీనిని అన్నం లేదా చపాతీతో తినవచ్చు.
Also Read : Spicy Food in Rain : వర్షాకాలంలో పకోడీలు, బజ్జిలు తినాలని ఎందుకు అనిపిస్తుందో మీకు తెలుసా?