Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!
- Author : Vamsi Chowdary Korata
Date : 28-06-2026 - 6:35 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రతిరోజూ టీ లేదా కాఫీ తాగే బదులుగా లెమన్ వాటర్ తాగుతే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ తీసుకుంటే ఎన్నో రోగాలు త్వరగా నయమవుతాయి. అంతేకాదు, రోగనిరోధకశక్తి పెరగడంతో పాటు శరీర బరువు కూడా సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ సిట్రస్ ఫ్రూట్‌లో సిట్రిక్ యాసిడ్ ఎక్కువ మోతాదులో లభిస్తుంది. ఇది ఆరోగ్యానికే కాదు, అందమైన చర్మానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే ప్రతిరోజూ పరిగడుపున చాయ్ లేదా కాఫీలకు బదులుగా లెమన్ వాటర్ తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇంతకీ నిమ్మకాయ నీళ్లు తాగితే ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో తెలుసుకుందాం…
* ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. శరీర బరువు పెరగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే బరువును తగ్గించుకోవాలి. అయితే శరీర బరువును సులభంగా తగ్గించుకోవడంలో సహజ సిద్ధమైన పరిష్కారంగా (Natural Remedy) నిమ్మకాయ వాటర్ ఎంతో ఉపయోగపడుతుంది. దీన్ని ప్రతిరోజూ పరిగడపునే గోరువెచ్చని నీళ్లతో కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తే అధిక బరువు సమస్య నుండి సులభంగా బయటపడొచ్చు. నిమ్మకాయలో ఉండే పాలీఫినాల్ అనే యాంటీ ఆక్సిడెంట్లు బరువు తగ్గడానికి సహాయపడతాయి.
* ఇక క్రమం తప్పకుండా నిమ్మకాయ వాటర్ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఇది శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది. లివర్‌ను శుభ్రపరుస్తుంది. వికారం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. నిమ్మకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి చాలా మేలు చేస్తాయి.
* కాగా వయసుతో సంబంధం లేకుండా చర్మం మెరిసిపోవాలన్నా, ముడతలు లేని చర్మం కావాలన్నా విటమిన్ సి ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి ఈ సమస్యలన్నింటికీ చక్కటి పరిష్కారం నిమ్మకాయ వాటర్. సూర్య కిరణాల వల్ల చర్మం కమిలిపోకుండా చేసే శక్తి నిమ్మకాయలో ఉంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి ఇది చక్కటి చిట్కాగా సహాయపడుతుంది. దగ్గు, జలుబు, అలర్జీలు, ఆస్తమా వంటి సమస్యలను తగ్గించడంలోనూ నిమ్మకాయ మంచి ఔషధంలా పనిచేస్తుంది.