Heart Attack: ఈ రెండు అలవాట్లతో ఎక్కువగా గుండెపోటుకు గురవుతున్న యువత.. అవేంటంటే?
Heart Attack: యువత ఎక్కువగా గుండెపోటుకు గురవ్వడానికి కారణాలు రెండు ఉన్నాయి అని వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:00 AM, Mon - 29 September 25

Heart Attack: ప్రస్తుతం రోజుల్లో యువత ఎక్కువగా గుండెపోటుకు గురవుతున్న విషయం తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురవుతున్నారు. ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య మరింత పెరిగింది. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో యువ భారతీయుల్లో గుండెపోటు సంఘటనలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గతంలో మధ్య వయసు వారికి, వృద్ధులకు మాత్రమే పరిమితమైన ఈ సమస్య ఇప్పుడు ఇరవైలు, ముప్పైల వయసు వారిని కూడా వణికిస్తోంది. దీనికి కొన్ని జీవనశైలి అలవాట్లు తోడై ప్రాణాంతక పరిస్థితులకు మరింత దారి తీస్తున్నాయి. అయితే యువ భారతీయుల్లో గుండెపోటు ప్రమాదం పెరగడానికి ప్రధానంగా రెండు ఆహారపు అలవాట్లు కారణం అని చెబుతున్నారు.
అందులో మొదటిది అల్పాహారం మానేయడం, రెండవది రాత్రి ఆలస్యంగా తినడం. ఈ రెండు అలవాట్లు ధమనులలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయట. ఒత్తిడిని కూడా పెంచుతాయట. ఈ రోజుల్లో యువత ఇష్టానుసారంగా ఏది పడితే అది తినడం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మరి ముఖ్యంగా చిన్న వయసులోనే అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అలాగే చాలామంది ఉదయం ఆఫీసుకు తొందరగా వెళ్లాలనే హడావిడిలో టిఫిన్ మానేయడం, అలాగే రాత్రి ఆలస్యంగా జరిగే పని ఒత్తిడి వల్ల డిన్నర్ ఆలస్యం చేయడం వంటివి మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం.
అయితే ఈ అలవాట్ల వల్ల గుండెపై అదనపు భారం పడుతుందట. ఈ విధమైన జీవనశలి అలవాటు చేసుకోవడం వల్ల తొందరగా గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. చాలామంది కొన్ని కొన్ని కారణాల వల్ల ఉదయం, సాయంత్రం తినడం మానేస్తూ ఉంటారు. కానీ ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు. కాగా ఒక అధ్యయనం ప్రకారం బ్రేక్‌ఫాస్ట్ మానేసే యువకుల్లో రక్తపోటు పెరగడం, జీవక్రియలు అస్తవ్యస్తంగా మారడం లాంటివి జరుగుతున్నాయట. ఇవి ధమనుల్లో కొవ్వు నిక్షేపాలను పెంచుతాయని, ఉదయం అల్పాహారం తినకపోవడం వల్ల శరీరంలో ఒత్తిడిని పెంచే కార్టిసోల్ వంటి హార్మోన్లు విడుదల అవుతాయని ఇవి గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయ అని చెబుతున్నారు. రాత్రి ఆలస్యంగా తినడం అంటే, భోజనం చేసిన వెంటనే నిద్రపోవడానికి సిద్ధం కావడం. దీనివల్ల శరీరంలో వాపు పెరుగుతుందట. నిద్రపోవడానికి ముందే రెండు గంటలలోపు రాత్రి భోజనం చేస్తే, శరీర జీవక్రియ ప్రక్రియలు దెబ్బతింటాయట. గ్లూకోజ్ నిల్వలు అస్తవ్యస్తంగా మారుతాయని,అంతేకాకుండా, శరీరంలో వాపు కూడా పెరుగుతుందని,ఇవన్నీ గుండె కండరాలకు నష్టం కలిగించే పరిస్థితులకు దారి తీస్తాయని చెబుతున్నారు.