Vijay Mallya : కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన విజయ్ మాల్యా
మాల్యా తరపున సీనియర్ న్యాయవాది సాజన్ పూవయ్య వాదనలు వినిపించారు. కింగ్‌ఫిషర్ ఎయిర్లైన్స్ సుమారు రూ.6,200 కోట్ల రుణాన్ని తీసుకోగా, ఈ రుణానికి సంబంధించి రూ.14,000 కోట్లను బ్యాంకులు రికవరీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
- By Latha Suma Published Date - 06:11 PM, Wed - 5 February 25

Vijay Mallya : బ్యాంకులకు రూ.వేల కోట్ల రుణాలను తిరిగి చెల్లించకుండా దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తాను బ్యాంకులకు చెల్లించాల్సి అప్పులు రూ. 6వేల200 కోట్లు అయితే రూ.14వేల కోట్లు రికవరీ చేశారని బ్యాంకుల రుణాల రికవరీ ఖాతాలను తనకు అప్పగించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాల్యా తరపున సీనియర్ న్యాయవాది సాజన్ పూవయ్య వాదనలు వినిపించారు. కింగ్‌ఫిషర్ ఎయిర్లైన్స్ సుమారు రూ.6,200 కోట్ల రుణాన్ని తీసుకోగా, ఈ రుణానికి సంబంధించి రూ.14,000 కోట్లను బ్యాంకులు రికవరీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
Read Also: Teenmaar Mallanna : తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు..
తనతో పాటు ప్రస్తుతం లిక్విడేషన్‌లో ఉన్న యూబీహెచ్‌ఎల్, ఇతర సంస్థల నుంచి వసూలు చేసిన మొత్తాల వివరాలను కూడా అందించాలని ఆయన కోరారు. తాజాగా ఈ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా, మాల్యా తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. మాల్యా పిటిషన్ ఆధారంగా జస్టిస్ ఆర్ దేవదాస్ నేతృత్వంలోని కర్ణాటక హైకోర్టు ధర్మాసనం బ్యాంకులు, లోన్ రికవరీ అధికారులకు నోటీసులు జారీ చేసింది. బ్యాంకులనుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టారన్న ఆరోపణలతో విజయ్ మాల్యా .. ప్రస్తుతం లండన్ లో ఉంటున్నారు. ఈ కేసులో విజయ్ మాల్యాను భారత్ కు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
విజయ్ మాల్యా బ్యాంకులకు రూ. 6,200 కోట్లు తిరిగి చెల్లించాల్సి ఉండగా.. రూ.14,131 కోట్ల విలువైన ఆస్తులను బ్యాంకులు రికవరీ చేశాయని లోక్‌సభలో ఆర్థిక మంత్రి తెలియజేశారు. ఆయన తీసుకున్న రుణం నుంచి దాదాపు రూ.10,200 కోట్లను చెల్లించినట్లు రికవరీ అధికారి కూడా తెలిపారు. మొత్తం రుణం చెల్లించినప్పటికీ, రికవరీ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. మాల్యాకు సంబంధించిన రికవరీ చర్యలపై స్టే విధించాలని కోర్టును కోరుతున్నాను. ఈ విషయానికి సంబంధించిన అన్ని బ్యాంకుల నుంచి అకౌంట్ స్టేట్‌మెంట్లను అందించాలని అభ్యర్థించారు.. అని న్యాయవాది తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం, ఈ అంశంపై స్పందించాలంటూ ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు సహా 10 బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 13లోగా స్పందన ఇవ్వాలని గడువు విధించింది.