Woman Judge Harassment : చనిపోయేందుకు అనుమతివ్వండి.. మహిళా జడ్జి ఓపెన్ లెటర్
Woman Judge Harassment : తనకు ఎదురైన లైంగిక వేధింపులపై ఏకంగా ఒక మహిళా జడ్జి రాసిన బహిరంగ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- By Pasha Published Date - 11:17 AM, Fri - 15 December 23

Woman Judge Harassment : తనకు ఎదురైన లైంగిక వేధింపులపై ఏకంగా ఒక మహిళా జడ్జి రాసిన బహిరంగ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక సీనియర్ న్యాయమూర్తి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సంచలన ఆరోపణ చేస్తూ ఉత్తరప్రదేశ్‌లోని ఓ జిల్లాకు చెందిన ఒక మహిళా జడ్జి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఓపెన్ లెటర్ రాశారు. ఈ బహిరంగ లేఖపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ స్పందించారు. ఆ మహిళా జడ్జి చేసిన ఫిర్యాదులు, విచారణ వ్యవహారాలపై తనకు సమగ్ర నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అతుల్ ఎం కుర్హేకర్‌ను సీజేఐ ఆదేశించారు. దీంతో మహిళా న్యాయమూర్తి చేసిన ఫిర్యాదులన్నింటిపై ఇవాళ సాయంత్రంకల్లా నివేదికను పంపాలని అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అతుల్ ఎం కుర్హేకర్ సూచించారు.
We’re now on WhatsApp. Click to Join.
తనను ఒక సీనియర్ న్యాయమూర్తి లైంగికంగా వేధిస్తున్నారంటూ 2023 జూలైలో అలహాబాద్ హైకోర్టు అంతర్గత ఫిర్యాదుల కమిటీకి బాధిత మహిళా జడ్జి(Woman Judge Harassment) ఫిర్యాదు చేశారు. అయితే ఆ విచారణను ప్రహసనంలా మార్చారని, తనకు న్యాయం జరగలేదని ఓపెన్ లెటర్‌లో బాధిత జడ్జి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విచారణలో సాక్షులుగా జిల్లా జడ్జి సహాయక సిబ్బంది వ్యవహరించారని, వాళ్లంతా తమ బాస్‌కు వ్యతిరేకంగా ఎలా సాక్ష్యం చెప్పగలుగుతారని లెటర్‌లో మహిళా జడ్జి ప్రశ్నను లేవనెత్తారు. జిల్లా జడ్జిని బదిలీ చేసి విచారణ చేస్తే.. సాక్ష్యులుగా ఉన్నవారు నిజాలు చెప్పే అవకాశం ఉంటుందని తాను చేసిన వాదనను ఎవరూ పట్టించుకోలేదని లేఖలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కూడా కేవలం ఎనిమిది సెకన్లలో తిరస్కరించిందని పేర్కొన్నారు.
Also Read: Chrome – Warning : గూగుల్ క్రోమ్ యూజర్స్‌కు ప్రభుత్వం వార్నింగ్
‘‘నాకు ఇక జీవించాలనే కోరిక లేదు. గత ఏడాదిన్నర కాలంలో నేను జీవచ్ఛవంగా మారాను. ప్రాణం లేని, నిర్జీవమైన ఈ శరీరాన్ని ఇకపై మోయడం వల్ల ప్రయోజనం లేదు. నా జీవితంలో ఎలాంటి ప్రయోజనం లేదు. బలవన్మరణం చేసుకునేందుకు నాకు న్యాయపరమైన అనుమతి ఇవ్వండి’’ అని ఓపెన్ లెటర్‌లో బాధిత మహిళా జడ్జి పేర్కొనడం గమనార్హం.