Cycle Symbol : ‘ఇండియా’ అభ్యర్థులంతా ‘సైకిల్’ గుర్తుపైనే పోటీ చేస్తారు : అఖిలేష్
అపూర్వమైన సహకారంతో తాము బైపోల్స్‌లో అన్ని సీట్లను గెలవబోతున్నామని అఖిలేష్(Cycle Symbol) విశ్వాసం వ్యక్తం చేశారు.
- By Pasha Published Date - 01:17 PM, Thu - 24 October 24

Cycle Symbol : ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. నవంబరు 13న బైపోల్ జరగనున్న తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో తమ కూటమి అభ్యర్థులంతా పార్టీలకు అతీతంగా సైకిల్ గుర్తుపైనే పోటీ చేస్తారని ప్రకటించింది. ‘సమాజ్‌వాదీ’కి చెందిన సైకిల్ గుర్తు ద్వారా ఇండియా కూటమి అభ్యర్థులు పోటీ చేస్తారనే విషయంపై స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రకటన విడుదల చేశారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించడమే ఏకైక లక్ష్యంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని ఆయన తెలిపారు. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు ఐక్యంగా భారీ విజయాన్ని సాధించబోతున్నాయని అఖిలేష్ చెప్పారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్ చేశారు.
Also Read :United Nations Day 2024 : ఇండియా వాంట్ ‘వీటో పవర్’.. ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు జరిగేనా ?
అపూర్వమైన సహకారంతో తాము బైపోల్స్‌లో అన్ని సీట్లను గెలవబోతున్నామని అఖిలేష్(Cycle Symbol) విశ్వాసం వ్యక్తం చేశారు. బైపోల్ జరగనున్న తొమ్మిది స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని కేటాయించాలనే దానిపై కూటమి కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఘజియాబాద్, ఖైర్ (అలీఘర్) అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ అంగీకరించిందని తెలుస్తోంది. మిగిలిన స్థానాలను సమాజ్‌వాదీ పార్టీకి వదిలేసినట్లు సమాచారం.
Also Read :Three Senas Battle : ఒక్క సీటు.. మూడు ‘సేన’ల ‘మహా’ సంగ్రామం
నవంబరు 13న ఉత్తరప్రదేశ్‌లో బైపోల్ జరగనున్న 9 అసెంబ్లీ స్థానాల జాబితాలో కతేహరి (అంబేద్కర్ నగర్), కర్హల్ (మెయిన్‌పురి), మీరాపూర్ (ముజఫర్‌నగర్), ఘజియాబాద్, మఝవాన్ (మీర్జాపూర్), సిసమావు (కాన్పూర్ నగరం), ఖైర్ (అలీఘర్), ఫుల్‌పూర్ (ప్రయాగ్‌రాజ్) , కుందర్కి (మొరాదాబాద్) ఉన్నాయి. వీటిలో ఎనిమిది చోట్ల ఎమ్మెల్యేలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీలుగా ఎన్నికయ్యారు. దీంతో ఆయాచోట్ల బైపోల్స్ నిర్వహించాల్సి వచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకి ఒక క్రిమినల్ కేసులో దోషిగా తేలారు. దీంతో ఆయనపై అనర్హత వేటు పడింది. ఫలితంగా సిసమావు స్థానానికి బైపోల్ వచ్చింది. నవంబరు 23న ఈ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.