Tejaswi Yadav: తేజస్వీ యాదవ్ కు నిరుద్యోగ యువతి లేఖ.. మీరు ప్రేమ వివాహం చేసుకున్నారు.. మరి నేను!
బిహార్ (Bihar) ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు పింకీ అనే ఓ నిరుద్యోగ యువతి రాసిన లేఖ
- Author : Maheswara Rao Nadella
Date : 11-02-2023 - 4:33 IST
Published By : Hashtagu Telugu Desk
బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు (Tejaswi Yadav) పింకీ అనే ఓ నిరుద్యోగ యువతి రాసిన లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఉద్యోగం రాని కారణంగా ప్రేమించిన వ్యక్తికి మనసులోని మాటను చెప్పలేకపోతున్నానని అందులో పేర్కొంది. ‘‘మీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ నిరుద్యోగం నా పెళ్లికి అడ్డంకిగా మారింది’’ అంటూ అందులో ఆవేదన వ్యక్తం చేసింది. చాలా కాలంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఆ యువతి.. ఉద్యోగం రాలేదన్న బాధతో ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కి (Tejaswi Yadav) లేఖ రాసినట్లు తెలుస్తోంది. నాలుగేళ్లుగా తాను ప్రభాత్ అనే రచయితను ప్రేమిస్తున్నట్లు అందులో పేర్కొంది. ఉద్యోగం వస్తే ప్రేమ విషయాన్ని చెప్పాలనుకున్నానని, కానీ ఇప్పటికీ తన కోరిక నెరవేరలేదని వాపోయింది. ఒక్కసారి కూడా ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడలేదని.. ఒకవేళ వచ్చినా పేపర్ లీక్ అవుతోందని అసహనం వ్యక్తం చేసింది. దీనిపై ప్రభాత్ స్పందించారు. ‘‘నాకు పింకీ ఎవరో తెలియదు. నేను ఎవ్వరితోనూ ప్రేమలో లేను. నా భార్య నాపై కోపంగా ఉంది. ఈ లేఖలో నిరుద్యోగం అనే అంశం ప్రధానంగా ఉంది. ఇక్కడ నా పేరును ప్రచారానికే వాడుకున్నారు. పింకీకి కావల్సింది ప్రేమ కాదు, ఉద్యోగం మాత్రమే’’ అని ఆయన తెలిపారు.
Also Read: Mahashivratri: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు మొదలాయె!