Three Soldiers Killed: ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జవాన్లు మృతి
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జవాన్లు (Three Soldiers Killed) మరణించారు. ఉగ్రవాదుల కోసం ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
- By Gopichand Published Date - 10:54 AM, Sat - 5 August 23

Three Soldiers Killed: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జవాన్లు (Three Soldiers Killed) మరణించారు. ఉగ్రవాదుల కోసం ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కుల్గామ్ జిల్లాలోని హలాన్ అటవీ ప్రాంతంలోని ఎత్తైన ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో సైన్యం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఇందులో కుల్గామ్ పోలీసులు కూడా పాల్గొన్నారు. శుక్రవారం (ఆగస్టు 4) సాయంత్రం సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ముగ్గురు సైనికులు గాయపడ్డారు. గాయపడిన సైనికులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, వారు శుక్రవారం అర్థరాత్రి మరణించారు.
జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించి 4 సంవత్సరాలు
జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసి నేటికి ఆగస్టు 5వ తేదీతో 4 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో శ్రీనగర్‌లో బీజేపీ విజయోత్సవ యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఉదయం 9.30 గంటలకు నెహ్రూ పార్క్ నుంచి ప్రారంభమయ్యే ఈ విజయయాత్ర షేర్-ఏ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ వరకు సాగనుంది. అదే సమయంలో ముందు జాగ్రత్త చర్యగా శనివారం (ఆగస్టు 5) అమర్‌నాథ్ యాత్రను వాయిదా వేశారు.
Also Read: Onion Prices: సామాన్యులకు మరో షాక్.. ఆగస్టు చివరి నాటికి పెరగనున్న ఉల్లి ధరలు..?
తప్పిపోయిన ఆర్మీ జవాన్
భారత ఆర్మీకి చెందిన జావేద్ అహ్మద్ వానీ జూలై 29న కుల్గామ్‌లోనే కనిపించకుండా పోయాడు. జూలై 29న సెలవుపై ఇంటికి వచ్చిన వానీ అదే రోజు సాయంత్రం కనిపించకుండా పోయాడు. జవాన్ ఇంటి నుంచి వెళ్లిన కారు రోడ్డు పక్కన కనిపించింది. అందులో రక్తపు ఆనవాళ్లు కూడా కనిపించాయి. జవాన్‌ని కిడ్నాప్ చేసినట్లు బంధువులు తెలిపారు.
గల్లంతైన జవాన్ ఆచూకీ కోసం సైన్యం, పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. 5 రోజుల తర్వాత ఆగస్టు 3న పోలీసు బృందానికి వానీ ఆచూకీ లభ్యం అయింది. జవాన్ కోలుకోవడం గురించి ఏడీజీపీ కశ్మీర్ తెలియజేసారు. వైద్య పరీక్షల తర్వాత అతన్ని విచారిస్తామని చెప్పారు. ఈ విచారణలో ఆర్మీ, పోలీసు అధికారులు పాల్గొంటారు.