Maha Kumbh Mela: ఇవే తొక్కిసలాటకు ప్రధాన కారణం: మల్లికార్జున్ ఖర్గే
యూపీ ప్రభుత్వం కుంభమేళాకు అరకొర ఏర్పాట్లు చేసిందని, వరుస కట్టిన వీఐపీలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, దాంతో సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఇవే తొక్కిసలాటకు ప్రధాన కారణమని మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు.
- Author : Latha Suma
Date : 29-01-2025 - 3:27 IST
Published By : Hashtagu Telugu Desk
Maha Kumbh Mela : కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మహా కుంభమేళాలో తొక్కిలాట ఘటనపై స్పందించారు. తొక్కిసలాట జరిగి 14 మంది ప్రాణాలు కోల్పోవడం, పలువురు గాయాలపాలు కావడం బాధకరమైన విషయమని, ఆ వార్త గుండెలను పిండేసిందని ఖర్గే అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి కూడా ఏర్పాట్లు సరిగా చేయకపోవడం తీవ్రంగా ఖండించదగిన విషయమని ఆయన అన్నారు.
యూపీ ప్రభుత్వం కుంభమేళాకు అరకొర ఏర్పాట్లు చేసిందని, వరుస కట్టిన వీఐపీలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, దాంతో సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఇవే తొక్కిసలాటకు ప్రధాన కారణమని మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. అంతేగాక కుంభమేళా ఏర్పాట్లపై ప్రభుత్వం సొంత డబ్బా కొట్టుకోవడం కూడా ఘటనకు మరో కారణంగా చెప్పుకోవచ్చని అన్నారు.
బాధితులకు కాంగ్రెస్ పార్టీ తరఫున అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు. మౌనీ అమావాస్య సందర్భంగా సంగం ఘాట్‌లలో పుణ్యస్నానాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారని, అదే తొక్కిసలాటకు కారణమైందని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ చెప్పారు. మహా కుంభమేళాలకు వీఐపీల రాకను అదుపు చేయాలని ఖర్గే సూచించారు. ఇలాంటి దుర్ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొని ఏర్పాట్లను మెరుగుపర్చాలన్నారు.
Read Also: Lucky Bhaskar: నెట్‌ఫ్లిక్స్‌లో లక్కీ భాస్కర్‌కు అరుదైన ఘనత!