Tata Motors Split : రెండు కంపెనీలుగా టాటా మోటార్స్.. ఎందుకు ?
Tata Motors Split : మన దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్.. ఇక రెండు వేర్వేరు కంపెనీలుగా విడిపోనుంది.
- Author : Pasha
Date : 05-03-2024 - 2:12 IST
Published By : Hashtagu Telugu Desk
Tata Motors Split : మన దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్.. ఇక రెండు వేర్వేరు కంపెనీలుగా విడిపోనుంది. ఈమేరకు టాటా మోటార్స్‌ను విభజించే ప్రతిపాదనకు కంపెనీ బోర్డు సోమవారమే ఆమోదం తెలిపింది. టాటా మోటార్స్ వాణిజ్య వాహనాలు, ప్రయాణికుల వాహనాలను తయారు చేస్తుంటుంది. ఇకపై ఈ రెండు విభాగాలను రెండు వేర్వేరు కంపెనీలుగా స్టాక్ మార్కెట్‌లో లిస్టు చేయనున్నారు. ఈ రెండు రంగాల్లోని వ్యాపార అవకాశాలను అందిపుచ్చు కునేందుకుగానూ ఈమేరకు విభజన చేసినట్లు తెలుస్తోంది. టాటా మోటార్స్ ప్రయాణికుల వాహనాలు, విద్యుత్ వాహనాలు (ఈవీ), జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) విభాగాన్ని కలిపి ఒక ప్రత్యేక కంపెనీగా రూపొందించనున్నారు.
We’re now on WhatsApp. Click to Join
టాటా మోటార్స్ వాటాదారులందరికీ ఈ రెండు లిస్టెడ్ కంపెనీల్లోనూ షేర్లు కేటాయించనున్నారు. టాటా మోటార్స్(Tata Motors Split) విభజనకు ఇప్పటికే కంపెనీ బోర్డు ఆమోదం తెలపగా.. వచ్చే రెండు వారాల్లో వాటాదారులు, రెగ్యులేటరీ సంస్థల నుంచి అనుమతి పొందనున్నారు. ఈ నిర్ణయం ఎఫెక్టుతో స్టాక్ మార్కెట్‌లో టాటా మోటర్స్ షేర్లు రయ్ రయ్ అంటూ పరుగెడుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం సమయానికి టాటా మోటార్స్ షేరు రూ.1,049 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ షేరు ధర మరింత పెరిగే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కొంతకాలంగా టాటా మోటార్స్ కమర్షియల్, ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వెహికల్స్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి విభాగాలు బలంగా రాణిస్తున్నాయి. ఆ సంస్థ కొన్నేళ్లుగా అమలు చేసిన వ్యూహాలే ఇందుకు కారణం. 2021 నుంచే ఈ విభాగాలన్నీ వేర్వేరుగా పనిచేస్తున్నాయి.
Also Read : Elon Musk Vs Indians : ప్రపంచ సంపన్నుల జాబితాలో భారతీయుల దూకుడు
గతంలో టాటా స్టీల్‌లో 7 కంపెనీలు విలీనం అయిన సంగతి తెలిసిందే.టాటా గ్రూప్ ఇటీవలకాలంలో తన వ్యాపారాల్ని వేగంగా విస్తరిస్తోంది స్టాక్ మార్కెట్లో ఇప్పటికే 30 వరకు సంస్థలు లిస్ట్ కాగా.. రానున్న రెండేళ్లలో మరో 5 వరకు లిస్ట్ అయ్యేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. వీటిల్లో టాటా క్యాపిటల్, టాటా సన్స్, టాటా ప్లే వంటివి ఉన్నాయి.