Tamil Nadu: తమిళనాడులో సీఎం స్టాలిన్, గవర్నర్ మధ్య మరోసారి వివాదం.. ఈసారి ఏం జరిగిందంటే..
తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్, గవర్నర్ ఆర్.ఎన్. రవిల మధ్య మరోసారి వివాదం నెలకొంది. మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేసిన విషయం విధితమే. అతని శాఖలను ఇతర మంత్రులకు కేటాయిస్తూ.. బాలాజీని కేబినెట్‌లో కొనసాగిస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించారు.
- By News Desk Published Date - 08:35 PM, Fri - 16 June 23

తమిళనాడు సీఎం ఎం.కే స్టాలిన్ (CM MK Stalin), గవర్నర్ ఆర్ఎన్ రవి (Governor R N Ravi) మధ్య మరో వివాదం తలెత్తింది. స్టాలిన్ ప్రతిపాదనను గవర్నర్ తిప్పిపంపగా.. గవర్నర్ బీజేపీ ఏజెంట్‌లా వ్యవహరించొద్దంటూ స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తమిళనాడు రాజకీయాలు మరోసారి గవర్నర్ వర్సెస్ సీఎం అన్నట్లుగా మారాయి. ప్రస్తుతం తమిళనాడు విద్యుత్‌శాఖ మంత్రిగా కొనసాగుతున్న సెంథిల్ బాలాజీ 2011-15 మధ్య కాలంలో ఏఐఏడీఎంకే అధికారంలో ఉన్నప్పుడుకూడా మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని అభ్యర్థులు నుంచి డబ్బులు వసూలు చేశారని కేసులు నమోదయ్యాయి. కొందరు ఫిర్యాదు మేరకు అప్పట్లో ఆయన మంత్రి పదవిని కోల్పోయారు.
జయలలిత మరణించిన తరువాత 2018 డిసెంబరులో సెంథిల్ బాలాజీ డీఎంకేలో చేరాడు. అప్పటి నుంచి కొనసాగుతున్న కేసులో తాజాగా బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. ఆయనను జూన్ 28 వరకు జ్యుడిషియల్ రిమాండ్‌కు కోర్టు ఆదేశించింది. దర్యాప్తు సమయంలో బాలాజీ అస్వస్థతకు గురికావటంతో ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో ఉన్నారు. ఇదిలాఉండగా.. సీఎం స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం బాలాజీ వద్ద ఉన్న రెండు శాఖలను కేబినెట్‌లోని ఇతర మంత్రులకు తిరిగి కేటాయించాలని భావించింది. దీంతో ఆ రెండు శాఖలను మంత్రులు ఎస్. ముత్తుస్వామి, తంగం తెన్నరసులకు అప్పగించాలని సీఎం స్టాలిన్ నిర్ణయించారు. ఈ ప్రతిపాదనతో పైలును గవర్నర్ రవికి పంపించారు. ఈడీ అరెస్టుచేసిన బాలాజీ శాఖలేమీ లేకుండా మంత్రివర్గంలో కొనసాగుతారని తెలిపారు. అయితే గవర్నర్ ఆఫైలును తిరస్కరించారు. దీంతో మంత్రి కే పొన్ముడి గురువారం రాత్రి విలేకరుల సమావేశంలో గవర్నర్ రవిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఈ విషయంపై సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. గవర్నర్ బీజేపీ ఏజెంట్‌గా వ్యవహరించవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, రాజ్‌భవన్ నుంచి శుక్రవారం అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటనలో సెంథిల్ బాలాజీకి ఉన్న పోర్ట్ పోలియోలను మంత్రులు ముత్తసామి, తంగం తెన్నరసులకు ఇప్పటికే వారు కలిగిఉన్న శాఖలతోపాటు అదనంగా కేటాయించినట్లు పేర్కొంది. అయితే, వి. సెంథిల్ బాలాజీని మంత్రి మండలి సభ్యునిగా కొనసాగించడానికి గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. క్రిమినల్ ప్రొసీడింగ్‌లను ఎదుర్కొంటున్నందున, ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తిని కేబినెట్‌లో కొనసాగించడం సరికాదని, ఆ ప్రతిపాదనను ఆమోదించటం లేదని రాజ్‌భవన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.