Electoral Bonds : మార్చి 12లోగా ఎలక్టోరల్ బాండ్ల లెక్క తేల్చండి.. ఎస్‌బీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Electoral Bonds : మార్చి 12న బ్యాంకు పనివేళలు ముగిసేలోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కు సుప్రీంకోర్టు ఆదేశించింది.
- By Pasha Published Date - 02:56 PM, Mon - 11 March 24

Electoral Bonds : మార్చి 12న బ్యాంకు పనివేళలు ముగిసేలోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికల బాండ్ల జారీ ద్వారా రాజకీయ పార్టీలు సేకరించిన విరాళాల వివరాలను సమర్పించే గడువును జూన్ 30 వరకు పొడిగించాలని ఎస్‌బీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఎస్‌బీఐ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత 26 రోజులుగా ఏం చేశారంటూ ఘాటుగా ప్రశ్నించింది. ఎస్‌బీఐ ఇచ్చే వివరాలను మార్చి 15న సాయంత్రం 5 గంటలకల్లా బహిర్గతపర్చాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ‘‘గత నెల ఇచ్చిన తీర్పు ప్రకారం విరాళాల వివరాలు వెల్లడించాలని మేం ఆదేశించాం. మీరు ఇలా అదనపు సమయం కోరుతూ మా దగ్గరకు రావడం తీవ్రమైన విషయం. మా తీర్పు స్పష్టంగా ఉంది. గత 26 రోజులుగా మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు. మీ దరఖాస్తులో ఆ విషయాలు ఏవీ లేవు’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్‌బీఐని ప్రశ్నించింది. ఎస్‌బీఐ ఆ సీల్డ్ కవర్‌ను తెరిచి, ఎన్నికల సంఘానికి సమాచారం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.
We’re now on WhatsApp. Click to Join
రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించడానికి వీలు కల్పించే ఎన్నికల బాండ్ల పథకాన్ని ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు రద్దు చేసింది. వాటి ద్వారా పార్టీలకు అందిన సొమ్ము, ఇచ్చిన దాతల వివరాలను మార్చి 6లోగా ఎన్నికల సంఘానికి అందించాలని ఎస్‌బీఐని ఆదేశించింది. ఆ సమాచారాన్ని మార్చి 13లోగా బహిరంగపరచాలని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది.
Also Read : Gutta Sukhender Reddy : నల్గొండలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి కీలక నేత ?
ఎలక్టోరల్ బాండ్లు అంటే..
ఎన్నికల బాండ్లను(Electoral Bonds) దాతలకు విక్రయించడం ద్వారా రాజకీయ పార్టీలు విరాళాలను సేకరించేవి. ఈ పద్ధతిలో విరాళం ఇచ్చే వ్యక్తి ఎవరు ? అనేది బయటకు తెలిసేది కాదు. అందుకే ఈ పద్ధతిని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రామిసరీ నోటు తరహాలో ఈ బాండ్లను జారీ చేసేవారు. కేంద్రంలోని మోడీ సర్కారు 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశంలోని ఎంపిక చేసిన ఎస్‌బీఐ బ్రాంచీల నుంచి ఎలక్టోరల్ బాండ్లను విక్రయించేవారు. రూ.వెయ్యి, రూ.10వేలు, రూ.లక్ష, రూ.10లక్షలు, రూ.కోటి విలువైన బాండ్లను అమ్మేవారు. ఈ బాండ్లను స్వీకరించిన రాజకీయ పార్టీలు 15 రోజుల్లోగా వాటిని ఎన్‌క్యాష్ చేసుకోవాలి. ఆ గడువు దాటితే బాండ్ విలువ మొత్తం ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్‌కు ట్రాన్స్ ఫర్ అవుతుంది.