ISRO : మరోసారి స్పేడెక్స్ డాకింగ్ వాయిదా
జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేయడమే లక్ష్యంగా స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్‌ను ఇటీవల ఇస్రో చేపట్టిన విషయం తెలిసిందే.
- By Latha Suma Published Date - 10:51 AM, Thu - 9 January 25

ISRO : ఇస్రో స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్(స్పేడెక్స్)కు అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ నెల 9న నిర్వహించాల్సిన అనుసంధాన (డాకింగ్) ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. మొదట ఈ నెల 7వ తేదీనే డాకింగ్ నిర్వహించాలని ఇస్రో భావించినప్పటికీ సాంకేతిక కారణాలతో 9వ తేదీకి వాయిదా పడింది. జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేయడమే లక్ష్యంగా స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్‌ను ఇటీవల ఇస్రో చేపట్టిన విషయం తెలిసిందే.
ఇందుకోసం రెండు ఉపగ్రహాలను 225 మీటర్ల సమీపానికి తెచ్చినప్పుడు వాటి దిశ ఊహించిన దాని కంటే కొంత తేడాగా ఉండటంతో డాకింగ్ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు ఇస్రో బుధవారం ‘ఎక్స్’లో ప్రకటించింది. అయితే ఉపగ్రహాలు సురక్షితంగా ఉన్నాయని తెలిపింది. డాకింగ్ తదుపరి తేదీని మాత్రం ప్రకటించలేదు.
కాగా, ఇస్రో తదుపరి చైర్మన్‌గా డాక్టర్ వీ నారాయణన్ నియమితులైన విషయం తెలిసిందే. ప్రస్తుత చైర్మన్ ఎస్ సోమనాథ్ పదవీకాలం ముగియనుండటంతో జనవరి 14న నారాయణన్ బాధ్యతలు చేపట్టనున్నారు. నారాయణన్ సారథ్యంలో చంద్రయాన్-4, గగన్‌యాన్, శుక్రయాన్, మంగళ్‌యాన్-2, పునర్వినియోగ వాహకనౌక తయారీ వంటి కీలక ప్రాజెక్టులను ఇస్రో చేపట్టనుంది. 1984లో శాస్త్రవేత్తగా ఇస్రోలో చేరిన నారాయణన్ నాలుగు దశాబ్దాలుగా అనేక కీలక ప్రాజెక్టుల్లో భాగస్వాములయ్యారు.