Sonia Gandhi: సోనియా గాంధీకి మళ్లీ అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మళ్ళీ అస్వస్థతకు గురయ్యారు.
- Author : Maheswara Rao Nadella
Date : 03-03-2023 - 3:00 IST
Published By : Hashtagu Telugu Desk
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) మళ్ళీ అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రికి తరలించారు. ఆమె బ్రాంకైటిస్ తో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. 76 ఏళ్ల సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. వాస్తవానికి ఆమె గురవారమే ఆసుపత్రిలో చేరినప్పటికీ… ఆలస్యంగా విషయం బయటకు వచ్చింది.
గురువారం నాడు సోనియా గాంధీ (Sonia Gandhi) ఆసుపత్రిలో చేరారని గంగారాం హాస్పిటల్ అధికార ప్రతినిధి తెలిపారు. మరోవైపు ఆసుపత్రి ఛైర్మన్ డీఎస్ రాణా మాట్లాడుతూ, జ్వరం లక్షణాలతో ఆమె ఆసుపత్రికి వచ్చారని… చెస్ట్ మెడిసిన్ డిపార్ట్ మెంట్ సీనియర్ కన్సల్టెంట్ ఆరుప్ బసు నేతృత్వంలోని వైద్య బృందం ఆమెను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని చెప్పారు.
ప్రస్తుతం సోనియాకు చికిత్స కొనసాగుతోందని, సోనియా గాంధీని అబ్జర్వేషన్ లో ఉంచామని గంగారామ్ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ లో తెలిపారు. ఈ ఏడాది ఆమె ఆసుపత్రిలో చేరడం ఇది రెండో సారి. జనవరిలో శ్వాసకు సంబంధించిన వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె హాస్పిటల్ లో చేరారు. మరోవైపు, సోనియా ఆసుపత్రిలో చేరారనే వార్తతో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి.
Also Read: Mukesh Ambani: ముఖేష్ అంబానీ రాకతో కళగా మారిన ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ సమ్మిట్