PM Modi : భారత్ తయారు చేసిన చిన్న చిప్ ప్రపంచాన్ని మార్చే శక్తి కలిగి ఉంది: ప్రధాని మోడీ
ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ..భారత్ తయారు చేస్తున్న చిన్న చిప్ ప్రపంచ మార్పుకు నాంది పలుకుతుంది. గతంలో మేము సెమీకండక్టర్ రంగంలోకి ఆలస్యంగా అడుగుపెట్టాం కానీ, ఇప్పుడు మమ్మల్ని ఎవరూ ఆపలేరు అని స్పష్టం చేశారు.
- By Latha Suma Published Date - 12:57 PM, Tue - 2 September 25

PM Modi : ప్రపంచాన్ని శాసించబోయే సాంకేతిక విప్లవానికి భారత్‌లో తయారవుతున్న చిన్న చిప్‌నే కేంద్రబిందువుగా మార్చే దిశగా దేశం ముందుకెళ్తోందని ప్రధాని నరేంద్ర మోడీ గట్టి ధీమా వ్యక్తం చేశారు. (సెప్టెంబర్ 2) మంగళవారం నాడు జరిగిన ‘ఇండియా సెమీకాన్ 2025’ ప్రారంభోత్సవంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ..భారత్ తయారు చేస్తున్న చిన్న చిప్ ప్రపంచ మార్పుకు నాంది పలుకుతుంది. గతంలో మేము సెమీకండక్టర్ రంగంలోకి ఆలస్యంగా అడుగుపెట్టాం కానీ, ఇప్పుడు మమ్మల్ని ఎవరూ ఆపలేరు అని స్పష్టం చేశారు. గత శతాబ్దం పెట్రోలియం ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఆధిపత్యం వహించిందని, అయితే 21వ శతాబ్దంలో సెమీకండక్టర్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కేంద్రబిందువవుతాయని పేర్కొన్నారు.
Read Also: AP : ఏపీలో అమల్లోకి వచ్చిన కొత్త బార్ పాలసీ
ఒకప్పుడు దేశాల శక్తి చమురు బావులపై ఆధారపడింది. కానీ ఇప్పుడు, ప్రపంచం చిన్నచిన్ని చిప్‌లలో దాగిన మేధస్సుపై ఆధారపడుతోంది. పరిమాణంలో చిన్నదైనా, ఈ చిప్‌లో ప్రపంచాన్ని వేగంగా ముందుకు నడిపించే శక్తి ఉంది అని మోడీ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి 40కి పైగా దేశాల ప్రతినిధులు హాజరుకావడం, భారత యువతలోని ప్రతిభ, ఆవిష్కరణలపై ప్రపంచ విశ్వాసానికి ప్రతీక అని ప్రధాని తెలిపారు. ప్రపంచం ఇప్పుడు భారత్‌ను నమ్ముతోంది. భారత్‌తో కలిసి సెమీకండక్టర్ రంగంలో భవిష్యత్ నిర్మాణం చేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తోంది అని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్ విలువ సుమారు 600 బిలియన్ డాలర్లుగా ఉందని, ఈ మార్కెట్ 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్లను దాటుతుందని అంచనా వేసినట్లు మోడీ గుర్తు చేశారు. ఇదే కారణంగా ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టి ఇప్పుడు భారత్‌పైనే నిలిచిందని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు మన దేశం బ్యాక్‌ఎండ్ పనులకే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు, డిజైన్ నుంచి తయారీ దాకా పూర్తి విలువ శ్రేణిని కవర్ చేసే సామర్థ్యాన్ని భారత్ సాధిస్తోంది అని తెలిపారు. ఈ రంగంలో స్థిరమైన పురోగతికి తమ ప్రభుత్వం తీసుకున్న దీర్ఘకాలిక విధానాలు కీలకంగా మారాయని వివరించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రెండో దశ సెమీకండక్టర్ మిషన్‌పై దృష్టి పెట్టిందని, దీని ద్వారా మరింత ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రధాని వెల్లడించారు. భవిష్యత్తులో ‘డిజైన్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా’ అన్న పదాలే భారత్ గుర్తింపుగా నిలవబోతున్నాయి అని మోడీ గట్టిగా చెప్పారు. ఇలా భారత ప్రభుత్వ వ్యూహాత్మక నూతన ఆలోచనలు, యువత ప్రతిభ, బలమైన మౌలిక సదుపాయాల మేళవింపు ద్వారా భారత్ త్వరలోనే గ్లోబల్ సెమీకండక్టర్ రంగంలో కీలక ప్లేయర్‌గా ఎదిగే మార్గంలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.