India Vs China : భారత్‌పై చైనా ‘గ్రే జోన్’ యుద్ధ వ్యూహాలు : భారత ఆర్మీ చీఫ్
ఎల్ఏసీ వద్ద భారత్ అభ్యంతరం తెలిపే పాయింట్ల నుంచి పూర్తిస్థాయిలో చైనా బలగాలను వెనక్కి పిలుచుకోలేదు’’ అని భారత ఆర్మీ చీఫ్ (India Vs China) వివరించారు.
- By Pasha Published Date - 04:21 PM, Tue - 1 October 24

India Vs China : చైనాతో బార్డర్ సమస్యకు సంబంధించిన కొత్త వివరాలను భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. చైనా సరిహద్దు వెంటనున్న వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద పరిస్థితులు నిలకడగానే ఉన్నప్పటికీ, సాధారణంగా మాత్రం లేవని ఆయన స్పష్టం చేశారు. ఎల్ఏసీ వద్ద 2020 సంవత్సరానికి మునుపటి శాంతియుత పరిస్థితులు తిరిగి ఏర్పడాలని భారత్ ఆకాంక్షిస్తోందన్నారు. ‘‘ఎల్ఏసీ వద్ద మునుపటిలా శాంతియుత వాతావరణం ఏర్పడనంత వరకు సాధారణ పరిస్థితులు రానట్టే. దీనిపై మేం చైనాతో చర్చలు జరుపుతున్నాం. ఇప్పటిదాకా చైనా వైపు నుంచి దౌత్యపరంగా సానుకూల సంకేతాలేవీ అందలేదు. ఎల్ఏసీ వద్ద భారత్ అభ్యంతరం తెలిపే పాయింట్ల నుంచి పూర్తిస్థాయిలో చైనా బలగాలను వెనక్కి పిలుచుకోలేదు’’ అని భారత ఆర్మీ చీఫ్ (India Vs China) వివరించారు. అయితే చైనా నుంచి ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు మన దేశం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ‘‘మనం చైనాతో పోటీపడాలి.. పోరాడాలి.. కలిసి జీవించాలి’’ అని ఆర్మీ చీఫ్ చెప్పారు.
Also Read :Julian Assange : జర్నలిజంపై వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజే సంచలన కామెంట్స్
‘‘నేటి కాలంలో గ్రే జోన్ యుద్ధ వ్యూహాలు చాలా ముఖ్యం. యుద్ధం జరగబోయే సమయానికి, ప్రస్తుత శాంతియుత కాలానికి మధ్య కాలంలో గ్రే జోన్ వ్యూహ రచనలు చేస్తుంటారు. వాస్తవానికి ఈ వ్యూహాలు రచించడంతోనే యుద్ధం మొదలైపోయినట్టు. ఇటీవలె కాలంలో లెబనాన్‌లో పేజర్లను పేల్చేందుకు ముందుగానే ఒక విదేశీ షెల్ కంపెనీని ఇజ్రాయెల్ కొనేసింది. దాని ద్వారా పేజర్లను కొనేసి, వాటిలోకి పేలుడు పదార్థాలను చొప్పించి లెబనాన్ మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లాకు విక్రయించింది. ఇలాంటి కుట్రలు చేయడంలో చైనా కూడా దిట్ట. అందుకే దానితోనూ మనం జాగ్రత్తగా ఉండాలి’’ అని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వివరించారు. ఎల్ఏసీ వద్ద చైనా ఆర్మీ నిర్మాణ పనులు చేపట్టడం కూడా దాని గ్రేజోన్ యుద్ధ వ్యూహంలో భాగమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘కార్గిల్, గల్వాన్, డోక్లాం వంటివి కూడా గ్రే జోన్ యుద్ధ వ్యూహాల ఫలితాలే. అవి పూర్తిస్థాయి యుద్ధాలు కాదు’’ అని ఉపేంద్ర ద్వివేది చెప్పారు.