Maharashtra : ఉప ముఖ్యమంత్రి పదవిపై షిండే కుమారుడు వివరణ..
తనకు అలాంటి కోరికేమీ లేదని, మంత్రివర్గంలో ఏ పదవికి తాను రేసులో లేనని చెప్పారు.
- By Latha Suma Published Date - 04:21 PM, Mon - 2 December 24

Maharashtra : ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తనయుడు శ్రీకాంత్ షిండే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడుతున్నట్టు వస్తున్న ఊహాగానాలపై తొలిసారి స్పందించారు. తనకు అలాంటి కోరికేమీ లేదని, మంత్రివర్గంలో ఏ పదవికి తాను రేసులో లేనని చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు విషయంలో జరుగుతున్న జప్యంపై వివరణ ఇస్తూ.. దీనిపై చాలా వదంతులు ప్రచారంలో ఉన్నాయని ఒక ట్వీట్‌లో తెలిపారు.
ప్రభుత్వంలో పొజిషన్ కావాలనే కోరిక తనకు లేదని శ్రీకాంత్ షిండే అన్నారు. రాష్ట్రంలోనూ ఎలాంటి మంత్రి పదవిని ఆశించడం లేదని స్పష్టం చేశారు. కేవలం తన లోక్‌సభ నియోజకవర్గం కోసం, శివసేన కోసం తాను పనిచేస్తానని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవికి తనకు అవకాశం వచ్చిందని, పార్టీ ఆర్గనైజేషన్ కోసం పనిచేసే ఆలోచనతో మంత్రి పదవిని నిరాకరించానని శ్రీకాంత్ షిండే తెలిపారు. ఇక, మహారాష్ట్రలోని కల్యాణ్ లోక్ సభ నియోజకవర్గానికి శ్రీకాంత్ షిండే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కాగా, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే గత రెండు రోజులు క్రితం అనారోగ్య కారణాలతో గ్రామానికి వెళ్లి విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పుకార్లు విజృంభించాయి. ఉప ముఖ్యమంత్రిని నేనే అనే వార్తలు గత రెండు రోజులుగా వ్యాపిస్తున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదు. డిప్యూటీ సీఎం పదవికి సంబంధించిన వార్తలన్నీ నిరాధారమైనవి అని శ్రీకాంత్ షిండే పేర్కొన్నారు.
కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ఘనవిజయం సాధించింది. 132 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. మహారాష్ట్ర సీఎం పదవిపై ఉత్కంఠ కొనసాగుతుండగా మహాయుతి విజయం తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంతకుముందు ఎన్సీపీ నేత అజిత్ పవార్ సీఎం ఎంపికపై బీజేపీకి మద్దతు పలికారు. అనంతరం శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండే బీజేపీకి పూర్తి మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు. మహారాష్ట్ర తదుపరి సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌కు చాలా మంది బీజేపీ నేతలు మద్దతు పలికారు.