West Bengal : మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఆ నియామకాలను రద్దు చేస్తూ గతంలో కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం సమర్థించింది. అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ 25వేల టీచర్ల నియామకాలు చెల్లవని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
- By Latha Suma Published Date - 03:13 PM, Thu - 3 April 25

West Bengal : సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయ నియామక కుంభకోణం వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై దర్యాప్తు చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఆ నియామకాలను రద్దు చేస్తూ గతంలో కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం సమర్థించింది. అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ 25వేల టీచర్ల నియామకాలు చెల్లవని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
Read Also: Sonia Gandhi : వక్ఫ్ సవరణ బిల్లు..రాజ్యాంగంపై దాడి చేయడమే
గతేడాది ఏప్రిల్‌లో కలకత్తా హైకోర్టు ఈ కుంభకోణంపై సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. 2016 నాటి స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్ (SLST) టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామక ప్రక్రియ చెల్లదని స్పష్టం చేసింది. అంతేగాక, దీనికింద ఉద్యోగాలు సాధించిన టీచర్లు తమ వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలని వెల్లడించింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పరీక్షతో జరిపిన నియామకాలను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. దీనిపై విచారణ జరిపిన సీజేఐ ధర్మాసనం ఫిబ్రవరి 10న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు లేవని పేర్కొంది. ఆ నియామకాలు చెల్లవని స్పష్టంచేసింది. ఆ నియామక ప్రక్రియను కలుషితమైనది, కళంకమైనదిగా అభివర్ణించింది.
అయితే, ప్రభావిత ఉపాధ్యాయులకు కాస్త ఊరట కల్పించింది. ఈ నియామక ప్రక్రియ కింద ఉద్యోగాలు సాధించిన టీచర్లు అప్పటివరకు అందుకున్న వేతనాలు, ఇతర భత్యాలను తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఇక, ఈ కుంభకోణం వ్యవహారంపై మరింత సమగ్ర దర్యాప్తు జరపాలని గతంలో హైకోర్టు సీబీఐని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ దీదీ సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌పై ఏప్రిల్ 4న విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొంది. ఇక, మూడు నెలల్లో కొత్తగా టీచర్ల నియామకాలు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, దివ్యాంగ ఉపాధ్యాయులకు మానవతా కోణంలో ఊరట కల్పించింది. వారు విధుల్లో కొనసాగొచ్చని స్పష్టంచేసింది.
Read Also: Lose Weight: సమ్మర్ లో ఈ విధంగా చేస్తే చాలు.. ఎంత లావు ఉన్నా నాజూగ్గా మారాల్సిందే!