Khalistani Supporter : తల్లి వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ అమృత్‌పాల్.. ఖలిస్తానీలకు మద్దతు
అమృత్‌పాల్ సింగ్ ఖలిస్తానీ వేర్పాటువాది. ఇటీవల ఇతడు పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు.
- By Pasha Published Date - 07:35 PM, Sun - 7 July 24

Khalistani Supporter : అమృత్‌పాల్ సింగ్ ఖలిస్తానీ వేర్పాటువాది. ఇటీవల ఇతడు పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు. ఇతగాడు నిత్యం బహిరంగంగానే ఖలిస్తాన్ వాదానికి మద్దతుగా వ్యాఖ్యలు చేస్తుంటాడు. ఎంపీగా గెలిచిన తర్వాత కూడా అమృత్‌పాల్ తన ధోరణిని మార్చుకోలేదు. భారత రాజ్యాంగం గుర్తించని.. భారత ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యతిరేకంగా ఖలిస్తాన్ వేర్పాటువాద అంశానికి మద్దతుగా మరోసారి అతడు వ్యాఖ్యలు చేశాడు.
We’re now on WhatsApp. Click to Join
‘‘నా కొడుకు ఖలిస్తానీ మద్దతుదారుడు కాదు. అతడిని జైలు నుంచి విడుదల చేయాలి’’ అని ఇటీవలే అమృత్‌పాల్ సింగ్ తల్లి (Khalistani Supporter) పేర్కొన్నారు. అయితే లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు నాలుగు రోజుల పెరోల్‌పై జైలు నుంచి విడుదలైన అమృత్‌పాల్ తన తల్లి వ్యాఖ్యలను కూడా ఖండించాడు. ఇప్పటికే లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణం చేసిన ఆయన.. ఆ మరుసటి రోజే ఖలిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ‘‘ఖల్సా రాష్ట్రం గురించి కలలు కనడం నేరం కాదు. అది గర్వించదగిన విషయం. లక్షలాది సిక్కులు తమ జీవితాలను త్యాగం చేసిన మార్గం నుంచి వెనక్కి తగ్గడం గురించి మనం కలలో కూడా ఊహించలేము’’ అని పేర్కొంటూ అతడు ఎక్స్‌లో ఓ ట్వీట్ చేశాడు. ‘‘ నిన్న మా అమ్మ ఇచ్చిన స్టేట్‌మెంట్ గురించి తెలియగానే చాలా బాధపడ్డాను. అనుకోకుండా మా అమ్మ ఈ వ్యాఖ్యలు చేసిందని అనుకుంటున్నాను. కానీ ఇలాంటి ప్రకటన మా కుటుంబం నుంచి కానీ.. ఖల్సా రాష్ట్రానికి మద్దతు ఇచ్చే వ్యక్తుల నుంచి రాకూడదు’’ అని అమృత్‌పాల్ పేర్కొన్నాడు.
Also Read :IND vs ZIM 2nd T20: నిన్న డకౌట్..ఇవాళ సెంచరీ దుమ్మురేపిన అభిషేక్ శర్మ
2023లో అమృత్‌పాల్ సింగ్ పంజాబ్‌లోని అజ్నాలా పోలీస్ స్టేషన్‌పై తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు. ఆ ఘటనలో పలువురు అధికారులు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఘటనలో అరెస్టైన తన అనుచరుల్ని అమృత్‌పాల్ సింగ్ విడిపించుకు వెళ్లాడు. ఖలిస్తానీ ఉగ్రవాది జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే అనుచరుడినని చెప్పుకునే అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు నెల రోజుల పాటు వేట సాగించారు. చివరకు పంజాబ్‌లో(punjab) మోగాలో గతేడాది అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత అతడిని అసోంలోని దిబ్రూగఢ్ జైలుకు తరలించారు. అమృత్‌పాల్‌పై యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత ప్రమాణస్వీకారం కోసం నాలుగు రోజుల పెరోల్‌తో అతడు విడుదలయ్యాడు.